నేడు పాక్‌లో జాతీయ సంతాప దినం
ఇస్లామాబాద్ : మధ్యధరా సముద్రంలో జరిగిన బోటు ప్రమాదం పాక్‌లో పెను విషాదం
నింపింది. ఆ ఘటనలో మరణించిన వారిలో 300 మందికిపైగా పాకిస్థానీలు ఉన్నట్లు
తేలింది. ఈ బోటులో 200 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు కథనాలొస్తున్నాయి.
ప్రమాదం నుంచి 12 మంది పాకిస్థానీలు ప్రాణాలను కాపాడుకొన్నారు. వీరి వివరాలను
పాక్ విదేశాంగశాఖ వెల్లడించింది. గ్రీస్‌లోని పాకిస్థానీ మిషన్ 24 గంటలపాటు
అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. వందల మంది పాకిస్థానీల ఆచూకీ
ఇంకా తెలియాల్సి ఉంది. పడవ ప్రమాదంలో అధికశాతం మంది బాధితులు తమ జాతీయులే
కావడంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు
సానుభూతి తెలిపారు. సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. మానవ అక్రమ
రవాణాకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఈ
పడవలో పాక్ జాతీయుల అక్రమ రవాణాకు కారకుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఆ
దేశాధికారులు కరాచీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతడు అజర్బైజన్
పారిపోదామని ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొన్నారు. 750 మంది
అక్రమవలసదారులను ఇటలీకి తీసుకెళుతున్న గ్రీస్‌కు చెందిన చేపల వేట బోటు
సముద్రంలో బుధవారం బోల్తాపడిన ఘటన తెలిసిందే. పడవ లిబియాలోని టొబ్రుక్ నుంచి
ఇటలీకి బయల్దేరిన సమయంలో గ్రీస్‌లోని ప్యాలోస్ తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో
దుర్ఘటన చోటు చేసుకొంది. ఇప్పటి వరకు 79 మృతదేహాలను వెలికి తీశారు.