విశాఖపట్నం: విశాఖలో శుక్రవారం నుండి రెండు రోజుల పాటు జరుగుతున్న గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లో మొదటి రోజు వివిధ రంగాలతో పాటు పర్యాటక రంగంలోనూ
పెట్టుబడులు వెల్లువెత్తాయని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం గ్లోబల్
ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి సంబందించి ఆయన పలు అంశాలు వెల్లడించారు. ఒక్క పర్యాటక
రంగంలోనే 21050.86 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆ రంగానికి చెందిన దిగ్గజ
సంస్థలు ఒబెరాయ్, తాజ్, గ్యారీ సన్ గ్రూప్స్ ముందుకు వచ్చాయని అన్నారు.
కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి 122 పర్యాటక
ప్రోజక్టులు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజాలు సిద్ధపడినట్లు
వెల్లడించారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడుల ద్వారా 39000 మందికి పైగా
ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుందని
అన్నారు.
చరిత్ర సృష్టించిన విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని
విజయసాయి రెడ్డి అన్నారు. సమ్మిట్ లో 25 దేశాలకు చెందిన ప్రతినిధులు
పాల్గొన్నారని, 46 మంది దౌత్యవేత్తలు పాల్గొన్నారని అన్నారు. అలాగే 30 మంది
గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొన్నారని అన్నారు. 15 ఫోకస్ సెక్టార్
సెస్సన్స్ నిర్వహించినట్లు తెలిపారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలు ఎంవోయూలపై
సంతకాలు చేసినట్లు తెలిపారు. 14000 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారని
తెలిపారు. సమ్మిట్ మొదటి రోజే పెద్ద ఎత్తున విజయవంతమై చరిత్ర సృష్టించిందని
ఆయన అన్నారు.