ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం : అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం, స్థానిక
ఆనందగజపతి ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
పదిమంది విభిన్న ప్రతిభావంతులకు, ట్రై మోటార్ బైకులను మంత్రి పంపిణీ
చేశారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం
చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు
చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రతిభలో దివ్యాంగులు సైతం సకలాంగులకు
తీసిపోరని అన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, కష్టపడి
చదవడం ద్వారా వృద్దిలోకి రావాలని కోరారు. ప్రతీ తల్లి ఆరోగ్యవంతమైన
బిడ్డను కనాలని అనుకుంటుందని, అయితే అవగాహనా లోపం, ఇతరత్రా
కారణాలవల్ల ఒక్కోసారి వివిధ రకాల లోపాలతో శిశువులు జన్మించడం
జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత, పోషకాహారాన్ని
తీసుకోకపోవడం, అయోడిన్, బి 12 లోపాలు, మేనరిక వివాహాలు తదితర
కారణాలవల్ల దివ్యాంగులుగా శిశువులు జన్మిస్తున్నారని అన్నారు. వీటి
నివారణాకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, పోషకాహారాన్ని పంపిణీ
చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న
పోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా చాలావరకు
రక్తహీనతను నివారించుకోవచ్చని సూచించారు. ఒక్కోసారి మానవ తప్పిదాలు,
త్రాగి వాహనాలను నడపడం, హెల్మెట్ లేకుండా వాహనలను నడపడం లాంటి
కారణాలవల్ల కూడా ప్రమాదాలకు గురై, వికలాంగులుగా మారుతున్నారని అన్నారు.
చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం, నిర్లక్ష్యన్ని విడనాడటం ద్వారా
ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. విజయనగరం మేయర్
వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, దివ్యాంగులు సైతం వివిధ రంగాల్లో తమ
ప్రతిభను నిరూపించుకుంటున్నారని అన్నారు. వారు కూడా ఇతరులకు తీసిపోరని,
కష్టపడి కృషి చేస్తే ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని చెప్పారు.
దివ్యాంగులకు అన్నివిధాలుగా సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లా విభిన్న
ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు జివిబి
జగదీష్ మాట్లాడుతూ, జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం
తీసుకున్న చర్యలను వివరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల
దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ రకాల పోటీల విజేతలకు
బహుమతులు అందజేశారు. దివ్యాంగులకు లేప్ట్యాప్లు, టచ్ ఫోన్లు, ట్యాబ్లు
తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఎంఎల్సి ఇందుకూరి రఘురాజు, డిప్యుటీ
మేయర్ ఇసరపు రేవతీదేవి, ఆర్టిఓ ఆదినారాయణ, సమగ్ర శిక్ష ఏపిసి
డాక్టర్ విఏ స్వామినాయుడు, ప్రముఖ సామాజికవేత్త పివి నర్సింహరావు, ఇతర
అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.