విజయవాడ : ఈ నెల 7న విజయవాడలో ‘జయహో బీసీ.. వెనుకబడిన కులాలే వెన్నెముక’
పేరుతో మహాసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సభ
పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు
బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, చెల్లుబోయిన
వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఎమ్మెల్యే
అదీప్‌రాజ్, ఎమ్మెల్సీలు కృష్ణమూర్తి, సునీత, రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి
పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పదవుల్లో బీసీలకు ఎప్పుడూ లేనంత
ప్రాధాన్యత దక్కిందన్నారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ
సమావేశం అనంతరం జోనల్ సమావేశాలు జరుగుతాయని, బీసీ నేతలంతా హాజరవుతారని ఆయన
తెలిపారు. ‘‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. తన జీవితంలో మళ్లీ సీఎం
అవ్వలేడు. ఆయన కేవలం తన కులం, తన కుటుంబం, తన మనుషుల కోసమే పనిచేశాడు. మూడు
సార్లు సీఎం చేసిన ప్రజలను మోసం చేశాడు. 25 ఏళ్లు వైఎస్ జగన్ సీఎంగా ఉంటారు.
పేదల కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారు. లోకేష్ అవలక్షణాలున్న వ్యక్తి. అలాంటి
లోకేష్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు యాత్ర చేసిన ప్రజలు నమ్మరు. లోకేష్,
చంద్రబాబులకు వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్ ఉండదు. 2024 తర్వాత టీడీపీ
కూడా ఉండదు’’ అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
బీసీలను తలెత్తుకుని తిరిగేలా చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీలను దేశంలో ఏ ముఖ్యమంత్రి
ఆదరించని విధంగా సీఎం జగన్ ఆదరించారన్నారు. బీసీలు తలెత్తుకుని తిరిగేలా
చేశారన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టింది వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ. ప్రతి బీసీ ఇంటికి సంక్షేమాన్ని సీఎం జగన్ చేర్చారు. జయహో
బీసీ సభను చరిత్రలో ఎన్నడు జరగని విధంగా నిర్వహిస్తాం’’ అని మంత్రి అన్నారు.