విజయవాడ : ‘ఇదేం ఖర్మరా, బాబూ’ అనుకుంటూనే ఏలూరు జిల్లాలో జనం వింటున్నారు కదా
అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నోటికి హద్దూ అదుపులేకుండా
పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత,పార్టీ రాష్ట్ర
కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి అన్నారు.శుక్రవారం నాడు ఆయన ఒక ప్రకటనను
విడుదల చేశారు. చంద్రబాబు ప్రసంగాలకు వినే శ్రోతలు, ప్రేక్షకులు ఉంటే
హైదరాబాద్ హైటెక్ సిటీలో కూడా హరికథ చెప్పగలరని ఎద్దేవా చేశారు. గురువారం
పోలవరం ప్రాంతంలో రోడ్ల మీద తన వాహనం నుంచే ఆయన ప్రసంగిస్తూ, ‘పోలవరం
ప్రాజెక్టు నాకు ప్రాణం. నన్ను వచ్చే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే నేను ఈ
బహుళార్థక సాధక ప్రాజెక్టును పూర్తి చేస్తా,’ అనే రీతిలో మాజీ ముఖ్యమంత్రి
ప్రజలకు హామీ ఇచ్చారని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే తప్ప గోదావరిపై
పోలవరం పూర్తి కాదన్నట్టు ఆయన పోకడ వుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
దివంగత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైందని బాబు
గుర్తుంచుకొవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో కొత్త నిర్మాణ
సంస్థ చేతిలో పడి నిలిచిపోయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ చివరి
సీఎం ఓ పెద్ద స్కాండల్ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. వేల కోట్ల రూపాయల
వ్యయంతో కూడిన పోలవరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి
నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు గాడిలో పెట్టిందని
వెల్లడించారు. తన నియంత్రణలో లేని పరిస్థితుల్లో కూడా వైఎస్సార్సీపీ సర్కారు
పోలవరం ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఓ
పక్క ఇంత జరుగుతున్నా చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టును తన ‘ఎన్నికల
ఆయుధం’గా మార్చుకోవడానికి అప్పుడే ప్రయాస పడుతున్నారని మండిపడ్డారు. పోలవరం
పేరు చెప్పి ఐదు ఆరు జిల్లాల ప్రజలను బురిడీ కొట్టించడం అంత తేలికకాదని ఈ మాజీ
హెటెక్ సీఎం గారికి ఏడాదిన్నర తర్వాత తప్పకుండా అర్ధమౌతుందని చెప్పారు.
ప్రతిపక్ష నాయకుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఆయన ఈ అంశం
గురించి దంచి కొడుతున్నారు. 1982లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన
తెలుగుదేశం పార్టీకి ఆయన మూడో అల్లుడు గారి ఆగడాల వల్ల ఎక్స్ పైరీ డేట్
దగ్గరపడినట్టు కనిపిస్తోందని అన్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక–2009,
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితమే చంద్రబాబు అండ్ సన్ అనే రాజకీయ
కంపెనీకి వస్తుందని వెల్లడించారు.