ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కొత్త కొత్త డ్రామాలకు తెరదీస్తున్నారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా జగ్గయ్యపేటలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా అందులోనూ సగం మంది ఇప్పటికే పార్టీని వీడారని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏ పార్టీ బంగాళాఖాతంలో కలిసిందో చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. అది కప్పిపుచ్చుకునేందుకు, టీడీపీ భూస్థాపితం కాకుండా కాపాడుకునేందుకు చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని పేర్కొన్నారు.
చూస్తుంటే ప్రతిపక్ష నేత పూర్తి గోబెల్స్ బాబుగా మారిపోయారనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు పేదల కోసం చేసిన ఒక్క మంచి పనిలేదని మల్లాది విష్ణు విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు జ్ఞప్తికి వస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పాలన సాగిస్తూ.. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన సహా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచే అనేక పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్విజయంగా అమలు చేస్తున్నారన్నారు.
అలా చంద్రబాబు పేరు వింటే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి ఎన్నికలలో మరోసారి టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంహెచ్ఓ శ్రీదేవి, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, బండి వేణు, నాగరాజు, యలమంద, రమా, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.