ప్రకాశం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీబీఐని రాష్ట్రంలోకి
రావద్దన్నారని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలోకి అనుమతించలేదని బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని తెలిపారు.
చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే జగన్ పాదయాత్రలు చేసేవారా
అని అంటున్నారని, ఐదేళ్లు జగన్ను రోడ్లపై నడిపించారని అన్నారు. బెంగాల్లో
ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనా తాము ప్రజాస్వామ్య యుతంగా
పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం
సరికాదన్నారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు
ప్రత్యేక హోదా వద్దన్నారని తెలిపారు. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును
అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా అని అడిగారు.
చంద్రబాబు బీజేపీ పెద్దలను వెళ్లి కలసివచ్చారని, వారు పొత్తులపై నిర్ణయం
తీసుకుంటారని సోము వీర్రాజు పేర్కొన్నారు.