హైదరాబాద్ : జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ ఛైర్మన్ శ్రీమతి కొండా సురేఖ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పిసిసిఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, అటవీ, పర్యావరణ శాఖ అడిషనల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెడికల్ ప్లాంట్ బోర్డ్ సోని బాల దేవి తదితర ఉన్నతాధికారులతో పాటు అటవీ, పర్యావరణం, నీటిపారుదల, పంచాయతీ రాజ్, రెవెన్యూ, ఫిషరీస్, టూరిజం శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నో రకాల మొక్కలు, పక్షులు, జంతువులకు ఆవాసంగా నిలుస్తున్న చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సహజంగా, కాలువల ప్రవాహంతో, మనుషుల ప్రమేయంతో ఏర్పడిన చిత్తడి నేలలను గుర్తించిడంతో పాటు వాటి పరిరక్షకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందని మంత్రి స్పష్టం సూచించారు. రాష్ట్రంలోని విస్తరించి ఉన్న చిత్తడి నేలలకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న శాఖలు సమన్వయంతో వ్యవహరించి చిత్తడి నేలలకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఒక్కొక్క శాఖ నుంచి నోడల్ అధికారి ఈ వివరాలను చిత్తడి నేలల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ పర్ట్ కమిటికి సమర్పించాలని సూచించారు. ఎక్స్ పర్ట్ కమిటి తమకు అందిన సమాచారం నుంచి చిత్తడి నేలల గుర్తింపుకు సంబంధించిన మార్గనిర్దేశకాలతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యటించి చిత్తడి నేలలను గుర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తద్వారా చిత్తడి నేలలుగా గుర్తించిన వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని పరరక్షించేందుకు చిత్తడి నేలల గుర్తింపు వీలు కల్పిస్తుందని తెలిపారు.
‘రామ్ సర్ ఒప్పందం’లోని ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో 75 సైట్లు ఉండగా, తెలంగాణలో ఒక్క సైట్ నూ గుర్తించపోవడం విచారించాల్సిన విషయమని అన్నారు. గత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. ‘రామ్ సర్’ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణలో మూడు నాలుగు సైట్లు గుర్తించే అవకాశాలున్నాయని అధికారులు ప్రస్తావించగా, ఆ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను సూచించారు. చిత్తడి నేలల గుర్తింపుకు సంబంధించిన కార్యాచరణలో వేగం పెంచి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.