మాటలతో ప్రజలను నమ్మించలేరని, గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం అసెంబ్లీలో నీటిపారుదల రంగం శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఎమ్యెల్యే హరీష్ రావు తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వజమెత్తారు. బీఆర్ఎస్ హయంలో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పుతున్నారని, అవినీతి జరిగిందో లేదో హరీష్ రావు చెప్పాలని కోరారు. చిత్తశుద్ధి, ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్ట్ టెండర్లలో అవకతవకలు జరిగాయని, కొంత మంది కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ది చేకూర్చేందుకు తక్కువ ధరకే టెండర్లు దక్కేలా చేశారన్నారు. నీటిపారుదల రంగంలో లక్ష ఎనబై వేల కోట్లతో టెండర్లు చేపట్టారని, పిలిచిన 300 టెండర్లలో కాంట్రాక్టర్లందరూ 1శాతం లోపు కోట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఇందులోని లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లు కేసీఆర్, హరీశ్‌రావుకు తెలియదా అని జూపల్లి ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని, వీటినుంచి ఎలా తప్పించుకుంటారని మండిపడ్డారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు కదా అని మండిపడ్డారు. నిజాయతీపరులు మాటలతో నమ్మించలేరు. చేతల ద్వారా మెప్పించాలని జూపల్లి పేర్కొన్నారు.
కృష్ణా జలాల విషయంలో అన్ని సక్రమంగా జరిగాయంటున్నారని, మరి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై కార్యదర్శి స్మితా సబర్వాల్ కేంద్రానికి రాసిన లేఖలో సగం మాత్రమే హరీష్ రావు ప్రస్తావించారని, మిగితా వాటి మాటేంటని మంత్రి జూపల్లి నిలదీశారు.