కృషి ఉంటే మనుషులు రుషులే కాదు..చిరంజీవి కూడా అవుతారని తన ప్రయాణంతో చాటి చెప్పాడు శివశంకర వరప్రసాద్. చదువుకునే వయసులోనే హీరో కావాలని కల కన్నాడు ఒక్కడే ప్రయాణం మొదలుపెట్టాడు. చిరంజీవిగా పేరు మార్చుకుని తనని తాను ఆవిష్కరించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. నంబర్ వన్ అనిపించుకున్నాడు. తనతోపాటే చిత్రసీమ స్థాయినీ పెంచాడు. చిత్రసీమలో ఏ పది మందిని పలకరించినా సరే, చిరంజీవిలా డ్యాన్స్ చేయాలని, ఆయనలా నటించాలని, ఆయనలా స్వయంకృషితో ఎదగొచ్చనే ధైర్యంతో వచ్చామనే సమాధానమే వినిపిస్తుంది. శిఖరం ఎక్కడమే కాదు. శిఖరాగ్రానికి చేరాక తొణకకుండా బెణకకుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవికి దక్కుతుంది. కొత్తతరం వచ్చినా..సినిమాలకి దాదాపు పదేళ్లు దూరంగా ఉన్నా ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు. ఆయనలో సేవాగుణం మరింత వన్నె తీసుకొచ్చింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి, ఆయన సేవా గుణమే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ గౌరవానికి కారణమైంది. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కిన తెలుగు నటుడు చిరంజీవి.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కొణిదెల శివ శంకర వరప్రసాద్‌కి చదువుకునే వయసులోనే నటనపై ఆసక్తి ఏర్పడింది. మద్రాసులోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే ‘పునాదిరాళ్లు’ చిత్రంతో తొలి అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. నటించిన తొలి చిత్రం ఇదే అయినా, ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ‘మనవూరి పాండవులు’, ‘శ్రీరామబంటు’, ‘కోతలరాయుడు’, ‘తాయారమ్మ బంగారయ్యా’, ‘కొత్త అల్లుడు’, ‘పున్నమినాగు’, ‘చట్టానికి కళ్లు లేవు’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘శుభలేఖ’, ‘అభిలాష’, ‘గూఢచారి నెం.1’, ‘మగ మహారాజు’ చిత్రాలతో ఆయన ప్రయాణం ఊపందుకుంది.
ఎన్నెన్నో పురస్కారాలు : 2006లోనే భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే ఏడాదిలోనే ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘స్వయం కృషి’, ‘ఆపద్బాంధవుడు’, ‘ఇంద్ర’ చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం చిరంజీవికి దక్కింది. 1987లో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు.
సేవా కార్యక్రమాల్లో : మదర్ థెరిస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం, నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు. కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సీసీసీ సంస్థని ఏర్పాటు చేసి విరాళాల్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. 2012 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2012- 2014 వరకూ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో కేంద్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు.