వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే కొత్త కార్యక్రమాలు
శ్రీకాకుళం వంతెనల సమస్య మీద జనసేన పోరాటం
ఎచ్చెర్ల నియోజకవర్గం సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల
మనోహర్
శ్రీకాకుళం : చిన్న పనులు చేయాలంటే నిధులు ఉండవు.. మనసు ఉండదు. రాష్ట్ర
బడ్జెట్ మాత్రం రూ.2.30 లక్షల కోట్లు దాటింది. డబ్బు ఎటు పోతుంది..?
శంకుస్థాపనలు చేసి ఎన్ని రోజులు మోసాలు చేస్తారు? ఏ పనీ చేయకుండా కాలక్షేపం
చేస్తున్న ప్రభుత్వం ఇది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాల సమీక్షలో
భాగంగా సోమవారం ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో మనోహర్
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “విశాఖ రాజధాని చేస్తే ఏదో
అద్భుతాలు జరిగిపోతాయని ఇక్కడి ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఈ ప్రభుత్వం
ప్రయత్నిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని యువతతో నేను మాట్లాడుతున్నప్పుడు వారు
కోరుకుంటున్నది రాజధాని కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు. వలసల
నిరోధం. జిల్లా మొత్తం మీద వంతెనల సమస్య ఉంది. ఏళ్లకు తరబడి వంతెనల కోసం
పోరాటాలు చేస్తున్న పట్టించుకోవడం లేదు.
వారి త్యాగాలకు అర్థం ఏది? : విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది త్యాగాలు
చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విషయం లో ఈ ప్రభుత్వం నోరు
మెదపడం లేదు. అలాగే అమరావతి కోసం సుమారు 32 వేల ఎకరాలు వేలాది మంది రైతులు
ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చిన్న కమతాలు ఉన్న రైతులు సైతం త్యాగాలు
చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి రాజధానిని మార్చాలి అని ఈ ప్రభుత్వం భావిస్తోంది.
స్టీల్ ప్లాంట్ త్యాగాలకు అలాగే అమరావతి రైతులు త్యాగాలకు విలువ ఎక్కడుంది?
ఉత్తరాంధ్ర భూముల కబ్జా గురించి ఆధారాలతో సహా చెప్పడానికి జనసేన జనవాణి కీ
ప్రజలు వస్తున్నారని తెలిసే, ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంది.
ఉత్తరాంధ్ర భూములు దోపిడీ బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వ పెద్దలు ఆ
కార్యక్రమాన్ని నిలిపివేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్య దగ్గర నుంచి కౌలు
రైతులు ఆవేదన వరకు ప్రజల సమస్యలు మీద నిర్భయంగా పోరాడింది జనసేన పార్టీ
మాత్రమే. తిత్లి తుపాను సమయంలో పక్క జిల్లాలో పాదయాత్రలో ఉన్నప్పటికీ నేటి
ముఖ్యమంత్రి కనీసం గంట సమయం శ్రీకాకుళం రావడానికి వెచ్చించలేదు. ఇప్పటికీ ఈ
ప్రాంతం మీద ఈ ముఖ్యమంత్రికి ఎలాంటి శ్రద్ధ లేదు.
కొండలు పిండి చేసే దోపిడీ : మన ఆస్తులు ఎంత పెంచుకోవాలి..మన కుటుంబంలో వారికి
ఎలా పదవులు ఇచ్చుకోవాలి అన్న ధ్యాస మాత్రమే ఇక్కడి సీనియర్ మంత్రులకు ఉంది.
ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తూ, ఏళ్ల తరబడి రాజకీయంలో ఉన్న నాయకులు ఈ
ప్రాంత అభివృద్ధికి చేసింది శూన్యం. కొండలను పిండి చేసే దోపిడీ మాత్రమే
వాళ్లకు తెలుసు. అద్భుతమైన సహజ వనరులు, కష్టపడే మనస్తత్వం ఉన్న ఈ ప్రాంతం
ఎందుకు వెనకబడిందో ఇక్కడి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇంట్లో
చిచ్చుపెట్టి గొడవలు సృష్టించే సంస్కృతి వైసీపీ ది. ఇక్కడి ప్రజలను ముందుకు
నడిపించే తత్వం కాకుండా, ఎలా అణగదొక్కాలి అనే మనస్తత్వం ఉన్న నాయకులు
పాలించారు కాబట్టే ఈ ప్రాంతం ఇంకా వెనకబడి ఉంది.
రాజీపడితే రాజకీయాలు చేయలేం : నిజాయతీగా ప్రజా సమస్యల కోసం పనిచేసే వ్యక్తుల
సమూహం జనసేన పార్టీ. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం.
కలిసికట్టుగా పోరాడి ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్దాం. గుడ్ మార్నింగ్ సీఎం
సార్ కార్యక్రమం తరహా లోనే శ్రీకాకుళం జిల్లాలోని వంతెనల సమస్యపై కూడా
ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక చేద్దాం. ప్రజా సమస్యలు
ఎక్కడున్నా అక్కడ జనసేన పార్టీ ఉండేలా పోరాడుదాం. ప్రభుత్వం పెట్టే అక్రమ
కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ప్రతి కార్యకర్తకు పవన్
కళ్యాణ్ అండగా నిలబడతారన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన
తాతారావు, ముత్తా శశిధర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్
కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, పార్టీ నేతలు గేదెల
చైతన్య, పెడాడ రామ్మోహన్, దాసరి రాజు, విశ్వక్షేన్, బాబు పాలూరి తదితరులు
పాల్గొన్నారు.