పులివెందుల బస్ టెర్మినల్‌పై నెగెటివ్ ప్రచారం
ఒక గ్లాస్లో 75 శాతం నీళ్లు ఉన్నా.. అసలు గ్లాసులో నీళ్లు లేవనే ప్రచారం
గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువే
అవినీతికి తావు లేకుండా సంక్షే పథకాలు అందిస్తున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
వైఎస్ఆర్ కడప జిల్లా : జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు . ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పులివెందులలో డా. వైఎస్ఆర్ బస్ టెర్మినల్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మిగిలిన బస్టాండ్లకు రోల్‌మోడల్‌గా పులివెందుల బస్టాండ్ తీర్చిదిద్దాం. ఒకవైపు బస్ టెర్మినల్ పనులు కనిపిస్తున్నా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు టెర్మినల్ పనులు జరుగుతున్నా కూడా నెగెటివ్ మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు తీరు ఎలా ఉందంటే ఒక గ్లాస్లో 75 శాతం నీళ్లు ఉన్నా అసలు గ్లాసులో నీళ్లు లేవనే ప్రచారం చేస్తున్నారు. గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్. గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది? అని సీఎం జగన్ ప్రతిపక్ష టీడీపీని నిలదీశారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా మనం చేసిన అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. జరిగిన అభివృద్ధి చూస్తే పులివెందులలోనే ఉన్నామా? అనిపిస్తోంది. సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి. అవినీతికి తావు లేకుండా సంక్షే పథకాలు అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. పులివెందులలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2023 నాటికి పూర్తవుతుంది. వేంపల్లెలలో రహదారుల విస్తరణకు భూసేకరణ కూడా జరిగింది. వచ్చే రెండేళ్లలో పులివెందులను ఒక నగరంగా మార్చే పరిస్థితికి చేరుకుంటుంది. ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ఆకాంక్షించారు. దేవుడి దీవెనలతో ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేసే అవకాశం తనకు కలగాలని ఆయన కోరుకున్నారు.
పులివెందుల నియోజకవర్గం– సమగ్ర నీటి సరఫరా : అదే విధంగా పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటిసరఫరా కొరకు దాదాపు రూ.480 కోట్లతో చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. అక్టోబరు 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా ఇది అందుబాటులోకి వస్తుంది. పులివెందుల , వేంపల్లె అండర్‌గ్రౌండ్ పనులు(యూజీడీ నిర్మాణాలు) కూడా రూ.192 కోట్లతో జరుగుతున్నాయి. పులివెందుల యూజీడీ పనులు మార్చి 2023 నాటికి, వేంపల్లె యూజీడీ పనులు అక్టోబరు 2023 నాటికి పూర్తవుతాయి. పులివెందుల పట్టణంలో సమగ్ర నీటి సరఫరా పథకం. దీనికి సంబంధించి పులివెందుల టౌన్‌కు జూన్ 2023 నాటికి ప్రజలందరికీ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయితో పాటు నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. వేంపల్లెలో ప్రధాన రహదారుల విస్తరణకి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రారంభించి డిసెంబరు 2023 నాటికి ఇది కూడా పూర్తవుతుంది.
ఇంటిగ్రేడెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ : పులివెందులలో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేడెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది మార్చి 2023 నాటికి క్రీడాకారులకు ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. పులివెందులో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మరియు వేంపల్లెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంబంధించి.. ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందులలో మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించాం. రూ.20 కోట్లతో వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబరు 2023 నాటికి పూర్తి చేస్తాం.
స్కిల్ ట్రైనింగ్ అకాడమీ : నైపుణ్య అభివృద్ధి కేంద్రానికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మార్చి 2023 నాటికి పూర్తవుతుంది. ఇక సిటీ సెంట్రల్… పులివెందులలో ఒక మాల్. సిటీలలో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక మాల్ కట్టే కార్యక్రమం జరుగుతుంది. రూ.87 కోట్లతో పనులు జరుగుతున్న ఈ మాల్ కూడా డిసెంబరు 2023 నాటికి అందుబాటులోకి వస్తుంది. రాణితోపుకి సంబంధించి నగరవనం అభివృద్ధి కార్యక్రమం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 2023 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. మరోవైపు ఇడుపుల పాయలో వైయస్సార్ మెమొరియల్ అభివృద్ధి పనులు కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి. పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేందుకు ఉరిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతాయి. గండి ఆంజనేయ స్వామి దేవస్ధానం పునర్నిర్మించే కార్యక్రమం కూడా జూన్ 2023 నాటికి పూర్తవుతుంది. ఇక నుంచి ప్రతి మూడు నెలలకొకసారి శంకుస్ధాపనలు కాదు…ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోయే కార్యక్రమాలు జరుగుతాయి.
ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ దిశగా : ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మంచి రోడ్లు తీసుకొచ్చే కార్యక్రమం కూడా వేగంగా జరుగుతుంది. పులివెందుల నుంచి బెంగుళూరుకి ప్రయాణం సులభతరం చేసేందుకు ఏకంగా రూ.1080 కోట్లతో ముద్దునూరు నుంచి బి.కొత్తపల్లి వరకు మరియు రూ.840 కోట్లతో బి.కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం పనులకు సంబంధించి ల్యాండ్ అక్విజేషన్ పనులు కూడా చివరిదశకు చేరుకున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ముందుగా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.