ధరలు పెంచాడు కాబట్టే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు
జగన్..జగ్గూభాయ్.. జగ్గూ.. రేపట్నుంచి ఏమంటానో నాకే తెలీదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్
తణుకు : సీఎం జగన్ మద్యపాన ప్రియుల పొట్టకొట్టి రూ.30వేల కోట్లు కొట్టేశారని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ధరలు పెంచాడు కాబట్టే పరదాలు
కట్టుకుని తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా
తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ‘‘బాధ్యతాయుతమైన పదవిలో
ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించనప్పడు మిమ్మల్ని మేమెందుకు గౌరవిస్తాం’’
అన్నారు. ‘జగన్ను.. జగ్గూభాయ్ అంటున్నానని వైసీపీ నేతలు తెగ
బాధపడుతున్నారు. నన్ను ఏదైనా అనొచ్చు గానీ.. నేను అనకూడదా? మమ్మల్ని బానిసలుగా
చూస్తే ఊరుకుంటామా? జగన్ నుంచి జగ్గూభాయ్ వరకు వచ్చాం. ఇంకా ఎక్కువ
మాట్లాడితే జగ్గూ అంటాం. వైకాపా నేతలు నోరు జారితే నేనేం అంటానో నాకే తెలీదు.
మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. జగన్
నిన్ను జగ్గూభాయ్ అని ఎందుకు అంటున్నానో అర్థమైందా? డిజిటల్ దొంగలా
తయారయ్యావు. ప్రజల డబ్బును దోచేస్తున్నావు. జగన్ పథకాలన్నీ 70:30 పథకాలే.
జగన్ దోపిడీని కాగ్ సవివరంగా బయటపెట్టింది. శివశివాని స్కూల్లో పేపర్లు
ఎత్తుకొచ్చిన నీకు మర్యాద ఎలా తెలుస్తుంది? జగన్కు అబద్దాలాడి సమర్థించుకునే
రోగం ఉంది. తాను దోచేసిన డబ్బు గురించి ఎప్పుడూ చెప్పరు.
జగన్ చెత్తపాలన వచ్చాకే చెత్త పన్ను : జగన్ చెత్త పాలన వచ్చాకే చెత్తపన్ను
వచ్చింది. ఇంటి పన్ను రూ.650 పెంచావు. డంపింగ్ యార్డు కూడా కట్టకుండా
చెత్తపన్ను వేస్తావా? తణుకుకు ఒక డంపింగ్యార్డు కూడా సరిగా లేదు. రాజకీయ
అవినీతిపై జనసేన పోరాటం చేస్తోంది. రాజకీయ అవినీతి మనం ఆపాలి. రూ.60 మద్యాన్ని
రూ.160కి పెంచారు. జగన్.. నీ పాలన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఇసుక ధరను
రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచేశారు. రూ. వేల కోట్లు రుణాలు తీసుకుని
బడ్జెట్ లెక్కల్లో చెప్పలేదు. పోలవరం పూర్తి చేయలేరు.. కనీసం కాలువల పూడిక
కూడా తీయించలేరా? జగన్ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయి. విగ్రహాల
ధ్వంసం కేసులో దోషులను ఇప్పటి వరకు పట్టుకోలేదు. అన్నవరంలో పురోహితులను వేలం
పెట్టారు. పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా? వేలం
వేయడానికి రాజ్యాంగ పరమైన హక్కు ఉందా? హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే
చేస్తారా? అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందని పవన్
వ్యాఖ్యానించారు.
జగన్పై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వారాహి
విజయయాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్
రెడ్డిపై విమర్శలు గుప్పించారు. “జగన్ కొంపలంటీస్తాడు. నేను గుండెలంటిస్తాను.
భవన నిర్మాణ కార్మికులకు వచ్చే సెస్సును తినేసి వారికి అన్యాయం చేశాడు. సగటు
మనిషి కష్టాలు నాకు తెలుసు. జగన్ బటన్ నొక్కాడు. నేను జగన్ నొక్కని బటన్లు
చెబుతాను. చెత్త మీద గతంలో పన్ను లేదు. నువ్వు పన్ను వేశావు జగన్. నిత్యావసర
వస్తువుల రేట్లను ప్రస్తావించిన పవన్.. 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలకు
పెంచి మద్యపాన ప్రియుల పొట్టను కొట్టావు. వారి గుండెలు పిండేసావు. రేట్లు
పెంచావు కాబట్టే, జనాలకు మొహం చూపించలేక పరదాలు కట్టుకుని తిరుగుతున్నావ్.
తణుకు టీడీఆర్ స్కాంలో రూ. 309 కోట్లు డబ్బు కాజేశారు.” అని పవన్ కల్యాణ్
ఆరోపించారు. తణుకుకు చెందిన కవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ రాసిన మాటలే జనసేన
ఆవిర్భావ మాటలు. నేను సైద్ధాంతిక బలంతో వచ్చాను. ఓటమి గెలుపు నాకు తెలీదు.
ప్రయాణం చేయడమే తెలుసు. సూర్యుడు అస్తమించినా పర్వాలేదు. కవి లేకపోతే ఏమీ
నడవదు. దూర్తుల సామ్రాజ్యంలో జనం హాహాకారాలు అంటూ కవిత్వం చెప్పిన పవన్.
తణుకులో నన్నయ్య భట్టారక పీఠాన్ని ఎంతో కవులు సందర్శించారని పవన్ అన్నారు.
రెండో విడత వారాహి విజయయాత్ర తణుకులో ముగిస్తున్నామని పవన్ తెలిపారు.