విజయవాడ : ఆప్కో బలోపేతానికి కృషి చేసి, చేనేత కార్మికులకు అండగా నిలుస్తానని
సంస్ధ నూతన ఛైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
తనపై ఉంచిన నమ్మాన్ని వమ్ము చేయకుండా, ఆప్కో అభివృద్దికి పాటు పడతానన్నారు.
పలువురు ప్రజా ప్రతినిధులు, చేనేత సంఘాల ప్రతినిధుల సమక్షంలో విజయవాడ ఆప్కో
కేంద్ర కార్యాలయంలో నూతన ఛైర్మన్ గా చిరంజీవి శుక్రవారం బాధ్యతలు
స్వీకరించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం తరువాత
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ద్వారా అత్యధిక మొత్తం అందించిన ప్రభుత్వం
ఇదేనని, ఇందుకు ముఖ్యమంత్రికి నేత కార్మికులు రుణపడి ఉంటారన్నారు. పాదయాత్రలో
నేతన్నల కష్టాలకు చలించిన ముఖ్యమంత్రి వారి అభ్యున్నతి కోసం నిరంతరం
తపిస్తున్నారన్నారు. విప్లవాత్మకంగా పేద బదుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ
వారి ఆర్ధిక స్వావలంబనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమది బిసిల పార్టీ
అని చెప్పుకునే చంద్రబాబు తెలుగుదేశంకు అసలు ఆ అర్హత లేదని, బిసిల అభ్యున్నతి
కోసం నాడు ఎన్ టిఆర్ తరువాత జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కృషి చేసారన్నారు.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాలలో మంగళగిరి నియోజకవర్గం మాత్రమే చేనేతలది
కాగా, అక్కడ కూడా తన కుమారుడిని ఎమ్ఎల్ఎ చేయాలని తలంచిన చంద్రబాబును ఏ ఒక్కరూ
నమ్మరని చిరంజీవి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఛైర్మన్ ,
ఎంఎల్ఎ మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే బిసిలకు
మేలు జరుగుతుందన్నారు. ఎంఎల్ సి మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ ఆధునిక
పోకడలకు అనుగుణంగా చేనేత వస్ర్తాలు రూపుదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. శాసన
మండలి సభ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ నిరుపేదలకు మేలు చేయాలన్న తలంపుతో
ముఖ్యమంత్రి ఉన్నారని, వారంతా అయనకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో
చేనేత జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్, దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్
బీరక సురేందర్, పద్మశాలి కార్పోరేషన్ ఛైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి తదితరులతో
పాటు ఆప్కో జిఎంలు మైసూరు నాగేశ్వరరావు, తనూజా రాణి, నాగరాజారావు,
కేంద్రకార్యాలయ మార్కోటింగ్ అధికారి రమేష్ బాబు, చేనేత జౌళి శాఖ నుండి సంయిక్త
సంచాలకులు శ్రీకాంత్ ప్రభాకర్, ఉప సంచాలకులు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.