వెలగపూడి సచివాలయం : రాష్ట్రంలోని చేనేత కళాకారులకు నిరంతరం ఉపాధి కల్పించే క్రమంలో ప్రభుత్వం విభిన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, వాణిజ్యం, సమాచార సాంకేతికత, చేనేత, జౌళి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడి సచివాలయం మూడవ బ్లాకులో ఆంధ్ర ప్రదేశ్ చేనేత సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) 90వ షోరూమ్ ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్ నాధ్ మాట్లాడుతూ ఆప్కో లాభాపేక్ష రహితంగా కేవలం చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఫనిచేస్తుందన్నారు. తద్వారా కార్మికులకు మెరుగైన ధర, నేత సంఘాలలో సామాజిక పురోగతి సాధ్యమవుతుందన్నారు. చేనేత జౌళి శాఖ కార్యదర్శి సునీత మాట్లాడుతూ ఆధునిక పోకడలకు అనుగుణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ద్వారా ఈ షోరూమ్ ను డిజైన్ చేయించామన్నారు. చేనేత ఉత్పత్తుల సాంప్రదాయ కళను ప్రోత్సహిస్తూ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ షోరూమ్ ను ఏర్పాటు చేసామన్నారు. సచివాలయంలో ఆప్కో ప్రదర్శన శాల ఏర్పాటు చేయటంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు తమను ఎంతో ప్రోత్సహించామన్నారు. కార్యక్రమంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామి రెడ్డి తదితరులు, ఆప్కో జిఎం తనూజ రాణి, కేంద్ర కార్యాలయ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, డివిజినల్ మార్కెటింగ్ అధికారి ఉమాశంకర్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.