గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చేనేత కార్మికుల
సర్వతోముఖాభివృద్దే ద్యేయంగా ఆప్కో తన పయనం సాగిస్తుందని సంస్ధ ఛైర్మన్ గంజి
చిరంజీవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహాకార సంఘం
(ఆప్కో) 38వ సర్వసభ్య సమావేశం మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ లో శనివారం
జరిగింది. రాష్టం నలుమూలల నుండి అయా చేనేత సహాకార సంఘల ప్రతినిధులు వందల
సంఖ్యలో హాజరుకాగా, విభిన్న అంశాలపై లోతుగా చర్చించి పలు తీర్మానాలు
ఆమోదించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి మానస పుత్రికగా అందిస్తున్న నేతన్న నేస్తం పధకం వేలాది మంది
చేనేత కార్మికుల జీవితాలలో వెలుగును ప్రసాదించిందన్నారు. కార్మికుల డిమాండ్
మేరకు రాయితీ నూలును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండి సంఘాలకు బకాయిలు లేకుండా చూసేందుకు
నూతన విధానానికి అంకురార్పణ చేయనున్నామన్నారు. పవర్ లూమ్స్ పోటీని తట్టుకునేలా
ఆధునికతకు అద్దం పడుతూ నూతన డిజైన్లను వినియోగదారులకు అందించవలసి ఉందన్నారు.
ఆప్కో ఆస్తులు వేటినీ విక్రయించబోమని, లీజుకు ఇచ్చిన వాటిని సైతం చట్టపరిధికి
లోబడి వెనక్కు తీసుకుంటామని స్పఫ్టం చేసారు. చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో
ఎండి ఎంఎం నాయక్ మాట్లాడుతూ ఆప్కోలో పారదర్శకత కోసం నూతన సాఫ్ట్ వేర్ లతో
కంప్యూటరీకరణను వేగవంతం చేస్తున్నామన్నారు. విపణిలో ఎదురవుతున్న పోటీని
తట్టుకుని వినియోగదారులకు ఏలా చేరువ కాగలమన్నదే మనకు సవాల్ గా మారిందన్నారు.
స్వల్ప మార్పులతో మరింత వైవిధ్యభరితమైన డిజైన్లను రూపొందించటం ద్వారా మంచి
మార్కెట్ ను పొందగలుగుతామన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు అప్పుపై వస్త్రాలు
అందించే పధకాన్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నామని, మరోవైపు నెలవారీ
పొదుపు పధకం ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసేలా మరో కార్యక్రమాన్ని కూడా
తీసుకురావలని సమాలోచిస్తున్నామని నాయక్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించే
క్లస్టర్ అభివృద్ది కార్యక్రమం మరో పది యూనిట్లకు మంజూరు అయ్యిందని, దీని
ద్వారా ప్రతి చేనేత కార్మికులు గరిష్టంగా రూ.30వేలు లబ్ది పొందగలుగుతాయని
వివరించారు.
చేనేత కార్మికులకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా సకాలంలో అందేలా చర్యులు తీసుకోవాలన్న
తీర్మానంపై సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి ప్రతిస్పందిస్తూ ప్రస్తుతం ఉన్న
రూ.12,500 మొత్తాన్ని రూ.25వేలకు పెంపుచేసేలా ప్రయత్నిస్తామన్నారు. చేనేత
పితామహులుగా పేరుగాంచిన దివంగత ప్రగఢ కోటయ్య, మాచాని సోమప్ప, మిడతు అప్పయ్య
జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఆప్కో
సర్వసభ్య సమావేశం తీర్మానాలను ఆమోదించింది. కార్యక్రమంలో భాగంగా మృతి చెందిన
చేనేత కార్మికులు కుటుంబ సభ్యులకు సంస్ధ ఛైర్మన్ గంజి చిరంజీవి, ఎండి ఎంఎం
నాయక్ లు రూ.12,500 వంతున చెక్కులు పంపిణీ చేసారు. జ్యోతీ ప్రజ్వలనతో
కార్యక్రమం ప్రారంభం కాగా, సమావేశంలో ఆప్కో డైరెక్టర్ అవ్వారి ఎల్లా
సుబ్బారాయిడు, చేనేత జౌళిశాఖ సంయిక్త సంచాలకులు మైసూరు నాగేశ్వరరావు,
కన్నబాబు, ఆప్కో జనరల్ మేనేజర్ తనూజారాణి తదితరులు పాల్గొన్నారు.