జూన్ చివరికి గరిష్ఠ స్థాయిలో కొత్త కేసులు
అక్కడి నిపుణుల అంచనాలు
కఠిన నిబంధనలు అవసరం లేదన్న అభిప్రాయం
ఆంక్షలకు వ్యతిరేకంగా గతంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు
చైనాలో మరో విడత కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ చివరికి కరోనా కేసులు
గణనీయ స్థాయికి చేరుకుంటాయని హూషాన్ హాస్పిటల్, సెంటర్ ఫర్ ఇన్ఫెక్షెస్ డిసీజ్
డైరెక్టర్ జాంగ్ వెన్ హాంగ్ తన అంచనాను ప్రకటించారు. అయినప్పటికీ, ఈ విడత
తీవ్ర లాక్ డౌన్ వంటి కఠిన చర్యలను అక్కడి నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.
కరోనా నివారణకు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని వెన్ హాంగ్ సైతం
అభిప్రాయపడ్డారు. జూన్ చివర్లో ఒక్కో వారంలో 6.5 కోట్ల కొత్త కేసులు వెలుగు
చూడొచ్చని డాక్టర్ జాంగ్ నాన్షాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం వారానికి 4 కోట్ల
కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. మలి విడత కరోనా కేసులతో చైనా ఆర్థిక
వ్యవస్థపైనా, ప్రజల జీవనంపైనా పెద్ద స్థాయిలో ప్రభావం పడదని వెన్ హాంగ్
పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే లాక్ డౌన్,
ఆంక్షల జోలికి వెళ్లరాదని సూచించారు. గత విడతలో కరోనాలో చాలా మంది వైరస్ బారిన
పడ్డారని, దాంతో దాని తీవ్రత పోయినట్టేనని యూనివర్సిటీ ఆఫ్ షికాగో పొలిటికల్
సైన్స్ ప్రొఫెసర్ దాలి యాంగ్ చెప్పారు. చైనా మొదటి విడత కట్టుదిట్టంగా
వ్యవహరించడంతో ఎక్కువ మందికి అక్కడ వైరస్ సోకలేదు. ఇటీవల మలి విడతలో ఎక్కువ
మంది దీని బారిన పడడం చూశాం. చైనా కరోనా కట్టడికి జీరో కోవిడ్ పాలసీని అమలు
చేయడం తెలిసిందే. ఒక్క కేసు వచ్చినా, ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్ చేయడం వంటివి
అమలు చేశారు. దీనివల్ల ప్రజా జీవనం మరింత దుర్భరంగా మారిపోవడంతో కొన్ని
ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం తెలిసిందే.