14 రోజుల పాటు జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి
నుంచి రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలిసే భారీ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిందని, 7 లక్షల మంది పార్టీ పదాతి దళం 14 రోజుల పాటు
ప్రజాభిప్రాయం సేకరిస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన
కృష్ణదాస్ చెప్పారు. శుక్రవారం ఉదయం నరసన్నపేటలోని మఠం వీధి నుంచి ఈ
కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయన మేజర్ పంచాయతి కార్యాలయంలో
మీడియాతో మాట్లాడారు. పార్టీ పదాతిదళంగా ఉన్న గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు
క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్తారనీ దాదాపు ఐదుకోట్ల మంది ప్రజలను
ప్రత్యక్షంగా కలిసి ‘మమ్మల్ని మా జగనన్న పంపారు. మీతో మాట్లాడి ప్రభుత్వ
సంక్షేమ పథకాల అమలుపై, ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు
వచ్చాం.’ అని చెబుతారన్నారు. ఒక ఇంటికి వెళ్లినప్పుడు ‘మీకు మా ప్రభుత్వం
ద్వారా ఏమేమి అందాయి..? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ఏం
గమనించారు..? ’ అని అడిగే సాహసోపేతమైన కార్యక్రమమిదన్నారు. గత టీడీపీ
ప్రభుత్వానికి ప్రస్తుత తమ ప్రభుత్వ పాలనను పోల్చి చెప్పే కరపత్రాలు కూడా
అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారికి డోర్, మొబైల్
స్టిక్కర్లు ఇస్తున్నామన్నారు. అంతే కాకుండా 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్
ఇవ్వాలని కోరతామని చెప్పారు. వెంటనే వారికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పే
సందేశం అందుతుందని వివరించారు. ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తేనే మరోమారు
ఆశీర్వదించండి..’ అని ధైర్యంగా, దమ్ముగా అనగలుగుతున్నామంటే అందుకు
కారణాలున్నాయన్నారు. మేనిఫెస్టోను దైవంగా భావించి 99 శాతం హామీలు అమలు చేయడమే
కాకుండా అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు
అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావడంలో, మరీ ముఖ్యంగా
మహిళల్ని అన్నిరంగాల్లో ముందుంచే కార్యక్రమాలు చేపట్టంలో తమ పార్టీ
నిర్మాణాత్మకంగా, బాధ్యతగా వ్యవహరించిందన్నారు. వాటి ఫలాల్ని చూస్తున్న
క్రమంలోనే ఈరోజు ప్రజలతో మమేకమై వారి అభిప్రాయం తెలుసుకునే బృహత్తర
కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం అని అన్నారు.
గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు నేరుగా ప్రజలను కలిసి.. గతానికి ఇప్పటి
ప్రభుత్వానికి తేడాను చెబుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు
కోరుకోవాలో, వారి భావితరాల భవిష్యత్తుకు వైఎస్ఆర్సీపీకి అధికారం ఆవశ్యకతను
వివరిస్తారన్నారు. ప్రతిపక్షాలను భుజానకెత్తుకున్న ఎల్లోమీడియానో,
సోషల్మీడియానో అర్జెంట్‌గా చంద్రబాబును గద్దె మీద ఎలా కూర్చొబెట్టాలనే
విషప్రచారాలకు చెంపపెట్టుగా మా వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ప్రజలకు అవగాహన
కల్పిస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ వివరించారు.