రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు బహుమతులు
ఈ నెల 15న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన సత్కారం
ఈ నెల 17న జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు
ఆధ్వర్యంలో సత్కారం
ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో
రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్ధులకు పురస్కారాల
ప్రదానం
గుంటూరు : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2023 సంవత్సరంలో పదో తరగతి పబ్లిక్
పరీక్షల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన
1,250 మంది విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యుత్తమ
ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్లో గ్రూపునకు ఒకరు చొప్పున 1,585 మందిని ‘జగనన్న
ఆణిముత్యాలు’ కార్యక్రమం కింద ప్రతిభ అవార్డులతో సత్కరించాలని రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం
స్థాయిల్లో విడివిడిగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు
నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తారు.
విద్యార్థులు తల్లిదండ్రులను శాలువాలతో, ఆ పాఠశాలల హెడ్మాస్టర్లను శాలువ,
మొమెంటోతో సత్కరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు
స్థానాలు సాధించిన విద్యార్ధులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక
మార్కులు సాధించిన నలుగురిని సత్కరించనున్నారు.
అంతకు ముందు ఈ నెల 17న జిల్లా స్థాయిలో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా
మంత్రులు ఆధ్వర్యంలో తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌లో అత్యధిక మార్కులు
సాధించిన విద్యార్ధులను, ఏడు ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్
పరీక్షలో నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన ఒక్కరు
చొప్పున నలుగురిని సత్కరించనున్నారు. ఈ నెల 15న అసెంబ్లీ నియోజకవర్గ
స్థాయిల్లో ఎమ్మెల్యేల అధ్యక్షతన పదో తరగతిలో మొదటి మూడు స్థానాలు సాధించిన
విద్యార్థులను, ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూపులో అత్యధిక
మార్కులు సాధించిన ఒక్కరు చొప్పున నలుగురిని సత్కరించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాలకు బహుమతులు : పదో తరగతిలో 42 మందికి,
ఇంటర్మీడియట్లో 35 మందికి ప్రతిభా అవార్డులు. పదో తరగతిలో మొదటి స్థానం
సాధించిన విద్యార్థులకు రూ.1,00,000, రెండో స్ధానం సాధించిన విద్యార్థులకు
రూ.75,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000 చొప్పున నగదు
బహుమతి. ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన
నలుగురేసి విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 అందచేస్తారు.
జిల్లా స్థాయిలో : పదో తరగతిలో 606 మందికి, ఇంటర్లో 800 మందికి ప్రతిభా
అవార్డులు ఇస్తారు. పదిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.50,000,
రెండో స్థానం సాధించిన వారికి రూ. 30,000, మూడో స్థానం సాధించిన విద్యార్థులకు
రూ.10,000 అందిస్తారు. ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు
సాధించిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తారు.
నియోజకవర్గ స్థాయిలో : పదో తరగతిలో 602 మందికి, ఇంటర్మీడియట్లో 750 మందికి
ప్రతిభా అవార్డులు ఇస్తారు. టెన్త్‌లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు
రూ.15,000, రెండో స్థానం సాధించిన విద్యార్థులకు రూ.10,000, మూడో స్థానం
సాధించిన విద్యార్థులకు రూ.5000లు నగదు బహుమతి. ఇంటర్మీడియట్లో నాలుగు
గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి
రూ.15,000 ఇస్తారు.
అందరి సమన్వయంతో కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి
జగనన్న ఆణిముత్యాలు సత్కార కార్యక్రమాలను మంత్రులు, ఎమ్మెల్యేలు,
ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్లు, ఇతర
అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి
ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్
రూమ్, ఇతర ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ కమిషనర్‌కు, ప్రభుత్వ పరీక్షల
డైరెక్టర్‌కు సూచించారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర శాఖలను,
అధికారులను సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
నియోజకవర్గస్థాయిలో మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూలు లేదా కాలేజీలో ఈ
కార్యక్రమం ఏర్పాటు చేయాలని, దీనికి మండల విద్యాధికారి కన్వీనర్‌గా
వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా మంత్రులను సంప్రదించి సత్కార
కార్యక్రమ వేదికను కలెక్టర్ ఎంపిక చేయాలని చెప్పారు.