గుంటూరు : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని జాతీయ ఆరోగ్య మిషన్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ కాన్పుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, అన్ని ఆస్పత్రుల్లో ప్రతి వైద్య పరికరం పనిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు పూర్తి ఉచితంగా, అత్యంత వేగంగా అందేలా చర్యలు తీసుకున్న ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. ఎన్ హెచ్ ఎం ద్వారా అమలవుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాల విషయంలో మంత్రి విడదల రజిని అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు గారు, ఎన్‌హెచ్ ఎం డైరెక్టర్ జె.నివాస్ , ఎన్ హెచ్ ఎం ఎస్పీఎం డాక్టర్ రవికిరణ్, డీహెచ్ రామిరెడ్డి, రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.