రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 49.65 లక్షలతో నిర్మించిన నూతన రహదారుల ప్రారంభం
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 57 వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో రూ. 49.65 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రహదారులను డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్ లతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాడు – నేడు ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నగరంపై ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానికులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఈ గురునాథం, డివిజన్ కోఆర్డినేటర్ కాళ్ల ఆదినారాయణ, నాయకులు చెన్నకేశవరెడ్డి, చిన్నారెడ్డి, బాల, ప్రేమ్ కుమార్, పఠాన్ నజీర్ ఖాన్, గోవింద్, శ్రీనివాస్, బేగం, రజియా, వీఎంసీ సిబ్బంది, స్థానికులు, పాల్గొన్నారు.