విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్లానింగ్ ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. కార్యక్రమ విధి విధానాలపై అజిత్
సింగ్ నగర్లోని షాదీఖానా నందు శనివారం సచివాలయ సిబ్బంది, గృహ సారథులు,
కన్వీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ‘జగనన్నకు చెబుదాం’
కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో
అద్భుతమైన కార్యక్రమమే ‘జగనన్న సురక్ష’ అని మల్లాది విష్ణు అన్నారు. అర్హులై
ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలి పోకూడదన్న ఏకైక లక్ష్యంతో, ప్రతి ఇంట్లో
ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని
రూపొందించినట్లు వెల్లడించారు. కనుక అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది
వారికి కేటాయించిన ప్రతీ ఇంటికి వెళ్లి వాలంటీర్ యాప్ నందు ప్రభుత్వ సంక్షేమ
పథకాల అవగాహన, సంక్షేమ ఫలాలు వారికి అందుతున్న తీరు గూర్చి నిర్దేశించిన
ప్రశ్నావళిని పూరించాలన్నారు. అలాగే ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లకు సంబంధించి
డాక్యుమెంట్లను సేకరించి సచివాలయాలలో అందజేసి జనరేట్ అయిన టోకెన్ ను తిరిగి
వారికి అందజేయాలన్నారు. మరోవైపు 58 వ డివిజన్ లోని 8 సచివాలయాల పరిధిలో 119
క్లస్టర్లు ఉన్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఆయా సచివాలయాల పరిధిలోని
కార్యదర్శులు కూడా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, అనర్హుల వివరాలతో జాబితా
సిద్ధం చేసుకోవాలని మల్లాది విష్ణు సూచించారు. గతంలో పరిష్కారం కాని వినతులను
కూడా మరోసారి పరిశీలించి, ఆగష్టు ఒకటి నుంచి లబ్ధి చేకూరేలా చర్యలు
తీసుకోవాలని తెలిపారు.
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా
అందుతున్న సేవలను కొనియాడారు. ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని సైతం ప్రజల్లోకి
విస్తృతంగా తీసుకువెళ్లి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డా. లత, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్,
సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు.