సురక్ష కార్యక్రమాన్ని తొలి రోజు తామరాపల్లి, జమ్ము, పోలాకి 1, 2 కలిపి
మొత్తం నాలుగు సచివాలయాల్లో మాజీ డిప్యూటీ సిఎం, వైయస్సార్సీపీ జిల్లా
అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు.
ఆయాచోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పలువురు లబ్ధిదారులకు
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల
వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ
వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’
కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన కార్యక్రమం ‘జగనన్న సురక్ష’ అన్నారు. దీని
ద్వారా వంద శాతం లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. నేటి నుంచి సచివాలయాల
వారీగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు ప్రభుత్వం నిర్వహిస్తున్నదని
చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు
సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను
వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా కృష్ణదాస్
పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.