ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మెరుగైన ఉపకారం
లభించిందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలపై ఆయన స్పందించారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.
48899 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.15589 కోట్లు ఖర్చు చేసినట్లు
వివరించారు. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 33625
కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.12487 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు
తెలిపారు. ఎస్పీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
చిత్తశుద్దితో చేస్తున్న కృషికి ఈ గణాంకాలే నిదర్శనమని అన్నారు.
ఏపీలో భారీగా పెరిగిన జీతభత్యాల వ్యయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతభత్యాల వ్యయం భారీగా పెరిగిందని రాష్ట్రాల ఆర్థిక
వ్యవహారాలు, బడ్జెట్ల పై ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నట్లు
విజయసాయి రెడ్డి తెలిపారు. 2018-19లో జీతభత్యాల వ్యయం రూ.32743 కోట్లు కాగా
2022-23 లో రూ.54768 కోట్లకు చేరిందని వివరించారు. ప్రక్క రాష్ట్రం తెలంగాణలో
జీతభత్యాల వ్యయం రూ. 29682 కోట్లు మాత్రమేనని అన్నారు.
టూరిజం హోటల్లలో ఆయుర్వేద, యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలి
ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ ) ఆద్వర్యంలో నిర్వహిస్తున్న
హోటల్లలో ఆయుర్వేద, యోగా సెంటర్లు ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి సూచించారు.
దేశంలో ఔషధ విలువల ప్రయాణాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దీని ద్వారా
ప్రజలు, వినియోగదారులు ఎన్నో విధాలుగా లాభపడతారని అభిప్రాయపడ్డారు. భారతీయ
వైద్య విధానానికి సంబంధించిన చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాలకు పర్యాటక
ప్రాంతాల జాబితాలో చేర్చాలని అన్నారు.
ప్రపంచ స్థాయి ఫుడ్ ప్యాకింగ్ విధానాన్ని అనుసరించాలి
ప్రపంచ స్థాయి ఫుడ్ ప్యాకింగ్ విధానం మనకు అవసరమని విజయసాయి రెడ్డి
అభిప్రాయపడ్డారు. ఒక ఆహార పదార్దాన్ని ప్యాకింగ్ చేసినపుడు ఆ పదార్దము ఎన్ని
క్యాలరీలు కలిగి ఉన్నదో వివరిస్తూ, ఆ క్యాలరీలను బట్టి పచ్చ, ఆరెంజ్, ఎరుపు
రంగు స్టిక్కర్లను ప్యాకింగ్ పై అతికించాలని అన్నారు. ప్రపంచ స్థాయి ఫుడ్
ప్యాకింగ్ విధానాన్ని అనుసరించే విధంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ
మంత్రి పీయూష్ గోయల్ చర్యలు చేపట్టాలని కోరారు.
బంగారంపై తగ్గిన దిగుమతి సుంకం
బంగారంపై దిగుమతి సుంకాన్ని 18.5% నుంచి 12.5 శాతానికి తగ్గించాలన్న కేంద్రం
ప్రతిపాదన సమాచారం స్వర్ణ ప్రియులకు ఊరట కలిగించే వార్తని విజయసాయిరెడ్డి
అన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కట్టడికి పన్ను తగ్గింపు అనివార్యమే కాకుండా,
బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.