62 వ డివిజన్ 270 సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో
సంక్షేమ విప్లవం నడుస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే
మల్లాది విష్ణు పేర్కొన్నారు. 62 వ డివిజన్ 270 వార్డు సచివాలయాల పరిధిలో
స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి గురువారం గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రకాష్ నగర్లో విస్తృతంగా పర్యటించి 280
కుటుంబాలను కలిశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ
ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం
ప్రభుత్వానికి సంక్షేమం అనే పథానికి అర్థం కూడా తెలియదని విమర్శించారు. కానీ
తాము గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటికి అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా
అంకెలతో సహా వివరిస్తున్నామన్నారు. గత నాలుగేళ్లలో రూ. 3.45 కోట్ల
సంక్షేమాన్ని సచివాలయ పరిధిలో అందజేసినట్లు వెల్లడించారు. అనంతరం కాలనీలో
పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సైడ్ కాల్వలలో సిల్ట్ ను ఎప్పటికప్పుడు
తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.
మహాయజ్ఞంలా పేదలందరికీ ఇళ్ల పథకం
రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంలా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకం పనులు
నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. తొలి దశలో
14,814 ఇళ్లు ఉండగా.. 9,759 ఇళ్లు గ్రౌండ్ అయినట్లు వెల్లడించారు. వీటిలో
నున్న లేఅవుట్లో 3,471, సూరంపల్లిలో 2,896, కొండ పావులూరులో 3,392 ఇళ్లు
ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నాటికల్లా ఎట్టిపరిస్థితుల్లోనూ గృహప్రవేశాలు
పూర్తిచేసి రెండో దశ పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. లబ్ధిదారులకు
క్లస్టర్ల వారీగా ఇళ్ల నిర్మాణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని పొదుపు
సంఘాల ఆర్.పి.లకు సూచించారు. అలాగే నిడమర్రులో ఇటీవల 7,211 మందికి ఇళ్ల
పట్టాలు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. వీరితో పాటు 90 డేస్ ప్రోగ్రాం ద్వారా
కొత్తగా 2,250 మంది అర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
టిడ్కో ఇళ్లకు సంబంధించి 300 చ.అడుగుల కేటగిరీలో సిద్ధంగా ఉన్న 400 ఇళ్లను
త్వరలోనే లబ్ధిదారులకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తామని
తెలియజేశారు.
వారాహి తొలి రోజు టూర్ అట్టర్ ఫ్లాప్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి రోజు వారాహి టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందని
మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దగ్గర అవుతుండటంతోనే
జన సైనికులు దూరమయ్యారని, నిన్నటి కార్యక్రమంతో ఆ విషయం తేటతెల్లమైందన్నారు. ఆ
ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో కూడా పవన్ కు తెలియడం లేదని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూర్చి మాట్లాడే ముందు స్థాయి తెలుసుకుంటే
మంచిదని సూచించారు. పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయినా ఉత్తర కుమార
ప్రగల్భాలను పవన్ నేటికీ మానుకోలేదని వ్యాఖ్యానించారు. పవన్ వి స్థిరత్వం లేని
మాటలని.. 2018–19 మధ్య తెలుగుదేశాన్ని, నారాలోకేష్ ను, కేంద్రంలోని బీజేపీని
పవన్ తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదన్నారు. మళ్లీ ఇప్పుడు వారితో కలిసి
ప్రయాణం చేస్తూ.. మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని
ధ్వజమెత్తారు. 2014 నుంచి 2018 వరకు టీడీపీతో పాటు బీజేపీతో దోస్తీ చేసిన
పవన్.. చంద్రబాబు పాలనలో జరిగిన దుర్మార్గాలు, హత్యలు, మారణ హోమాలపై ఎందుకు
మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
ఉన్నారన్న అక్కసు, సంక్షేమ పాలనలను చూసి ఓర్వలేనితనం పవన్ మాటల్లో స్పష్టంగా
కనిపించిందన్నారు. ధైర్యముంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో
రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డులు.. ఈ ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులు,
అందించిన సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. అలాగే వారాహి
టూర్లో జనసేన అధినేత చేసిన దిగజారుడు విమర్శలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని
మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం క్షమించబోరని
హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి,
డివిజన్ కోఆర్డినేటర్ వీరబాబు, నాయకులు అలంపూర్ విజయ్, రామిరెడ్డి, మస్తాన్,
హైమావతి, సావిత్రి, సాంబయ్య, వెంకట్, బ్రహ్మేంద్ర, బోరా బుజ్జి, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.