నరసన్నపేట : రోడ్ల మీద సభల వల్ల ప్రజల ప్రాణాలు పోయినా పట్టించుకోని జనసేన
అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందుకు కారకుడైన చంద్రబాబుతో భేటీ కావడం వారి
దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పవన్ కు
రాజకీయ విజ్ఞత శూన్యమని పేర్కొన్నారు. కుప్పంలో జీఓ నంబర్1 ను పోలీస్
యంత్రాంగం అమలు చేయడానికి ప్రయత్నిస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దానిపై
మీడియా ముందు నటిస్తే అతని దత్త పుత్రుడు ఓవర్ యాక్షన్ చేయడానికి
సిద్దమైపోయారని ఎద్దేవా చేశారు. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు
బాబు పర్యటనలోనే ప్రాణాలు వదిలితే పవన్ కళ్యాణ్ కనీస మానవత్వంతో కూడా
స్పందించలేకపోయారని, అందుకు కారణమైన చంద్రబాబునాయుడిని వెనకేసుకువస్తూ మళ్లీ
కొత్త కుయుక్తులు పన్నడానికి వ్యూహరచన చేశారని ఆరోపించారు. జరిగిన అనర్ధాలను
దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జీఓ నంబర్ 1ని తీసుకువస్తే దానిని కూడా తమ
రాజకీయ లబ్దికి వాడుకోవడానికి వారు సిద్ధమైయ్యారని, అన్నీ ప్రజలు
గమనిస్తున్నారని చెప్పారు. జనం ప్రాణాలతోనే రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే
మిమ్మల్ని మరోసారి తేరుకోనివ్వకుండా గుణపాఠం నేర్పడానికి జనమే సిద్ధంగా
ఉన్నారని కృష్ణదాస్ హెచ్చరించారు. పవన్ దత్త పుత్రుడు కాదని చెప్పగలరా? నని
విమర్శించారు.