గుంటూరు : జనరిక్ మందుల్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని, వైద్య ఆరోగ్య
విభాగానికి చెందిన వారంతా చొరవచూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
విడదల రజిని సూచించారు. మంగళగిరిలోని నిర్మలా ఫార్మసీ కళాశాలలో
ప్రభుత్వం మంగళవారం అధికారికంగా నిర్వహించిన జనఔషధి దివాస్
కార్యక్రమంలో మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కంపెనీలు మార్కెటింగ్, పర్సంటేజీల
ఆశచూపుతూ మందుల్ని అధిక ధరలకు విక్రయించే ప్రయత్నం చేస్తుంటాయని, వీరి
మాయలో ఎవరూ పడకూడదని కోరారు. మందుల చీటిలపై రోగానికి సంబంధించిన ఔషధం
పేరే రాయలన్నారు. జన ఔషధి దుకాణాల్లో అత్యంత చౌక ధరకే మందులు
దొరుకుతాయన్నారు. నేరుగా కంపెనీ నుంచి వచ్చిన మందుల్ని ప్రజలకు
అందజేస్తారన్నారు. చాలా చౌకగా, అత్యంత నాణ్యమైన మందులు జన ఔషధి
దుకాణాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రోగులంతా ఈ దుకాణాల్లోనే మందులు కొనుగోలు
చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఔషధ నియంత్రణ అధికారులదేనన్నారు.
సిఎం లక్ష్యాల్ని నెరవేర్చాలి
పేదలందరికి అత్యంత సులువుగా, వేగంగా నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా
అందాలనే సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పని
చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య శాలలన్నింటినీ నాడు- నేడు కార్యక్రమం
కింద పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా
ఉచితంగా వైద్యాన్ని అందజేస్తున్నామన్నారు. సిఎం లక్ష్యాన్ని నెరవేర్చేలా
ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. ఎన్ ఎంసీ నిబంధనలకనుగుణంగా
వ్యవస్థలు నడిచేలా చూడాలన్నారు. ఎవరైనా కంపెనీల పేర్లతో మందుల చీటిలు
రాస్తున్నా, వాటిని ఏ మందుల దుకాణాలైనా ప్రోత్సహిస్తున్నా చర్యలు
తీసుకునేందుకు వెనుకాడొద్దని ఆదేశించారు. అప్పుడే జన ఔషధి దివాస్
కార్యక్రమాలకు సార్ధకత చేకూరుతుందన్నారు.
జన ఔషధి దుకాణాల్లో 1759 రకాల మందులు
జన ఔషధి దుకాణాల్లో ఏకంగా 1759 రకాల మందులు అందుబాటులో ఉంటాయని మంత్రి
తెలిపారు. 280 సర్జికల్ డివైజెస్ కూడా దొరుకుతాయన్నారు. ఇవన్నీ అత్యంత
తక్కువ ధరకే లభిస్తాయన్నారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక వ్యాధులతో
బాధపడుతున్న రోగులకు ఈ దుకాణాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని, వీరంతా జన
ఔషధి దుకాణాల్లోనే మందులు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత వైద్యులు,
డ్రగ్ విభాగం అధికారులదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 145
జనఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్యను మరింతగా పెంచనున్నామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.
కృష్ణబాబు, ఔషధ నియంత్రణ శాఖ డీజీ రవిశంకర్ నారాయణన్, డైరెక్టర్
ఎంబీఆర్ ప్రసాద్, నిర్మలా కళాశాల అధ్యక్షురాలు మరియా సుందరి, కళాశాల
ప్రిన్సిపాల్ అబ్దుల్ రెహమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.