రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజ్
శాసనమండలిలో ఎమ్మెల్సీలు పాటించవలసిన విధి, విధానాలపై భీమవరంలో ఎమ్మెల్సీల రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర శాసన మండల చైర్మన్ కొయ్యే మోషేన్ రాజ్ తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని శాసనమండలి చైర్మన్ క్యాంపు కార్యాలయం నందు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ లతో కలిసి ఎమ్మెల్సీల సదస్సు నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజ్ మాట్లాడుతూ శాసనమండలి యొక్క విధి, విధానాలు, క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్స్, సభలో సభ్యులు వ్యవహరించవలసిన తీరు, అనుసరించవలసిన నిబంధనలు, సూచనలు, తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎమ్మెల్సీలతో సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. సదస్సు నిర్వహణకు భీమవరం బివి రాజు కాలేజ్ (విష్ణు కాలేజ్) ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చాలా సంవత్సరాల క్రిందట ఇటువంటి సదస్సును నిర్వహించడం జరిగిందని, ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించడానికి ఆలోచన చేయడం జరిగిందన్నారు. సదస్సు నిర్వహణ ప్రాంతంలో బందోబస్తు, పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణ, అతిథులకు ఆహ్వానం, అతిధి మర్యాదలు, స్థానికంగా ఉన్న చర్చి, మసీదు, దేవాలయంలలో దర్శనం, ఆశీర్వచనం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు. రవి ప్రకాష్, రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పి.పి.కె రామాచార్యులు, జాయింట్ సెక్రెటరీ విజయ రాజు, సహాయ కార్యదర్శిలు శ్రీనివాసరావు, విశ్వనాధ్, పశ్చిమగోదావరి డిఆర్ఓ బి.శివన్నారాయణ, భీమవరం ఆర్డీవో కె .శ్రీనివాసులు రాజు, మున్సిపల్ కమిషనర్ కె.శ్యామల పాల్గొన్నారు.