అరాచక పాలనకు ముగింపు పలకాలి
పవన్ కు ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక
కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం : పవన్ కల్యాణ్
అనకాపల్లి : జనసేనలో చేరుతున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని, రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైసీపీకి రాజీనామా చేసిన కొణతాల ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టత ఇచ్చారు. చెప్పినట్టుగానే కొణతాల ఆదివారం తనవారితో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఏపీలో అరాచక పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ ఈ దిశగా రాజీలేని పోరాటం చేస్తాడని తాను నమ్ముతున్నానని తెలిపారు. పవన్ కు ఏపీ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు.
కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం : పవన్ కల్యాణ్
కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న ఆయన జనసేనలోకి రావడం మంచి పరిణామం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత కలిగిన నాయకుడాయన. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు రామకృష్ణ సేవలు దోహదమవుతాయని పేర్కొన్నారు