ప్రత్యేక హోదా తెస్తానని ఢిల్లీలో మెడలు వంచుతోందెవరో గమనించాలి
ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది
కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్
కళ్యాణ్
కాకినాడ : ఎవరు ఏ మతాన్ని నమ్మినా, ఏ దేవుడిని పూజించినా ఎవరికీ ఇబ్బంది లేదు.
కేవలం రాజకీయాల కోసం మతాన్ని వాడుకునే వారితోనే అందరికీ ఇబ్బంది’ అని జనసేన
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ
మైనార్టీలు కాదు. ఈ దేశం మనందరిదీ అన్నారు. ముస్లింల భద్రత, గౌరవానికి ఏ
మాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వచ్చే
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల జీవన
ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ
ఇచ్చారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో ముస్లిం ప్రతినిధులతో
పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారత దేశంలో సమాజం వేరు, రాజకీయ
పార్టీలు వేరు. మైనార్టీలు అనగానే సంపూర్ణంగా అవకాశాలు ఉండవనే భావన మొదట మీ
మనసులో నుంచి తొలగించండి. భారతదేశం కులాల సమాజం. ఒక్క దళితుల్లోనే 14 రకాల ఉప
కులాలు ఉన్నాయి.
రాజకీయాల్లోకి రావడానికి ముందు మతాలు, మత ఘర్షణలపై చాలా అధ్యయనం చేశాను. మత
ప్రాతిపదిక భారతదేశం, పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోవడం వరకు క్షుణ్ణంగా
తెలుసుకున్నాను. మహమ్మద్ అలీ జిన్నా హిందు, ముస్లింలు కలిసి ఉండలేరు.
ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పెట్టిన ప్రతిపాదన మేరకు దేశ విభజన
జరిగింది. దేశ విభజన సమయంలో అనేక మంది ఆడపడుచులు ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో
జరిగిన మత ఘర్షణల వల్ల దాదాపు రూ. 10 లక్షల మంది మరణించారు. కొంతమంది
హిందువులు పాకిస్థాన్ లో ఉండిపోతే ముస్లింలు కొంతమంది భారతదేశంలో ఉండిపోయారు.
పాకిస్థాన్ లో హిందువులపై దాడులు జరుగుతాయి, బలవంతంగా మత మార్పిడిలు
జరుగుతాయి. ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇక్కడ మాత్రం ఒక ముస్లింకు అన్యాయం
జరిగినా ఇంకో హిందువు అండగా నిలబడతాడు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే
అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత్ క్రికెట్ జట్టుకు
కెప్టెన్ అయ్యారు. వ్యక్తుల్లో మంచి, చెడులు గురించి మాట్లాడుకోవాలి తప్పితే
మతం గురించి కాదు. పూర్వం భారతదేశంలో ఇస్లాం మతం రాకమునుపు మా దేవుడు గొప్ప
అంటే మా దేవుడు గొప్ప అని శైవులు, వైష్ణవులు కొట్టుకున్నారు. ఏ మతంలోనైనా
విపరీతవాదాన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాలి.
వైసీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తే ఏం చేశాడు?
గత ఎన్నికల్లో ముస్లింలు వైసీపీని పూర్తిగా నమ్మారు.. మద్దతు ఇచ్చారు. ఉభయ
సభల్లో కలిపి ఆ పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తే బీజేపీ
మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పిన ఆ నాయకుడు ఢిల్లీ వెళ్లి ఏం
వంచుతున్నాడో మనందరికీ తెలుసు. బీజేపీ అడిగినా అడగక పోయినా ఉభయ సభల్లో ఆ
పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు. నేను వైసీపీలా గుడ్డిగా బీజేపీకి వత్తాసు
పలకను. మీకు ఆ విషయం నిలకడగా తెలుస్తుంది. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం
ప్రతినిధులకు ఇఫ్తార్ ఇవ్వడంతో పాటు ఇస్లాం విద్య, ధార్మిక సంస్థల అభివృద్ధికి
రూ.25 లక్షలు విరాళం ఇచ్చాను. నా వ్యక్తిగత సంపదను మీకు ఇచ్చిన వాడిని. రేపు
జనసేన అధికారంలోకి వస్తే ప్రజా ప్రభుత్వంలో ఇంకెంత అండగా ఉంటుందో ఆలోచించండి.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఉర్దూ మీడియంను మళ్లీ తీసుకొస్తాం.
సచార్ కమిటీ సిఫార్సులను మేనిఫెస్టోలో చేర్చుతాం : నాదెండ్ల మనోహర్
పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వం
ముస్లిం సోదరుల హక్కులు కాలరాస్తోంది. పింఛన్లు ఎత్తేశారు, శ్మశానాలు
ఆక్రమించేశారు. ప్రతి మున్సిపాలిటీలో ఉర్దూ పాఠశాల ఉండేది. అవీ కనబడడం లేదు.
మొన్న తెనాలి పర్యటనలో చూస్తే ఉర్దూ స్కూల్ ఉండాల్సిన ప్రదేశంలో చెత్త సేకరణ
వాహనాలు నిలిపి ఉన్నాయి. 5వ తరగతి వరకు ఉర్దూలో చదువుకోవడం మీ హక్కు. బాధ్యతగల
ప్రభుత్వంగా ముస్లిం మైనారిటీ సోదరుల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరాలి. ఈ ప్రభుత్వంలో అవినీతి, కబ్జాలు
పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి తన కోసం రూల్స్ మొత్తం ఇష్టానుసారం మార్చేశాడు. మీ
కోసం ఒక మంచి వ్యక్తి మన ముందు ఉన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయతీ, నిబద్ధత గల
నాయకుడు. జనసేన పార్టీ మ్యానిఫెస్టోలో సచార్ కమిటీ సూచనలు పరిగణలోకి
తీసుకుంటాం. ప్రతి అంశం అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. మీరు కోరుకున్న మార్పు
కోసం జనసేన పార్టీని నమ్మండి. పింఛన్లు తీసేస్తారనో, ఏదో చేస్తారనో ఎవ్వరూ
భయపడవద్దన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు అర్హంఖాన్, కందుల దుర్గేష్, పంతం
నానాజీ, ముత్తా శశిధర్ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయూబ్ కమల్
సమన్వయకర్తగా వ్యవహరించారు.