పొత్తులపై అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తాం
షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండో రోజు పదాధికారులు, ముఖ్యనేతల సమావేశం
విజయవాడ : రానున్న సార్వత్రిక ఎన్నికలపై ఏపీ బీజేపీ నేతల కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రెండో రోజు పదాధికారులు, ముఖ్యనేతల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మరికొందరు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఇతర అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. జనసేన మా మిత్రపక్షమే. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు? మా పార్టీ బలోపేతం కోసం మేం పనిచేస్తాం. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించామన్నారు. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్ఠానానికి వివరిస్తామని,అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు.
జనసేన మా మిత్ర పక్షమే : జనసేన తమ మిత్ర పక్షమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఏ పార్టీలో చేరితే తమకెందుకు అని, తమ పార్టీ బలోపేతం కోసం తాము పని చేస్తామని పురందేశ్వరి తెలిపారు. నాదెండ్లతో భేటీ మర్యాద పూర్వకమే. శివప్రకాష్ జీని కలవడానికే మనోహర్ వచ్చారు. షర్మిల ఏ పార్టీలో చేరితే మాకెందుకు. మా పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాం. పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై చర్చించాం. పొత్తులపై మా అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తాం. పొత్తులపై అంతిమ నిర్ణయం మా అధిష్టానం చూసుకుంటుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.
జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం. హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని, బీజేపీ పై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించాం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తాం. భాజపాలో కొత్త నేతల చేరికలపై దృష్టి సారించాం. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తాం. పొత్తుల అంశంపై సమావేశంలో చర్చించాం. అయితే, పొత్తుల అంశంపై మేం ఒక్కరమే తీసుకునే నిర్ణయం కాదు. మాతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారు కూడా స్పందించాలి. పొత్తు కోరేవారు అధిష్ఠానంతో మాట్లాడాలి. రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది. టీడీపీతో పొత్తులో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ చెబితే సరిపోతుందా? పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని సత్యకుమార్ స్పష్టం చేశారు. బీజేపీ పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ అయ్యారు.