కేటాయించాలిజ్ఞాన సముపార్జన, నైపుణ్య శిక్షణ పేదరికాన్ని పారద్రోలే మార్గాలు
విద్యలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలి, ప్రాధాన్యత ఇవ్వాలి
పర్యావరణాన్ని విస్మరించటం మానవాళి వినాశనానికి దారి తీస్తుంది, ఇప్పటికే ఆ
ప్రతికూలతలు మనం చూస్తున్నాం
పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయటంతో పాటు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి
స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని
ప్రారంభించిన వెంకయ్యనాయుడు
ముఖ్య అతిథిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం
హైదరాబాద్ : జనాకర్షక పథకాల మీద కాకుండా జనహిత పథకాలకు ప్రాధాన్యత పెరగాలని
భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజలకు హితవు పలికారు.
స్వర్ణభారత్ ట్రస్ట్, హైదరాబాద్ చాప్టర్ లో యశోద హాస్పిటల్స్ వారి సహకారంతో
ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ
కార్యక్రమానికి హాస్యబ్రహ్మ శ్రీ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ
సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను బ్రహ్మానందం
అభినందించారు. ముఖ్యంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారి ఉత్తమ పౌరులుగా
తీర్చిదిద్దుతున్న ట్రస్ట్ చొరవను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రతిది ఉచితం అనే పరిస్థితి
మారాల్సిన అవసరం ఉందని, నిథుల్లో సింహ భాగం వైద్యం, విద్య రంగాలకు
కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించేందుకు
కృషి జరగాలన్న ఆయన, వైద్యరంగంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం
తొలగిపోవాలని సూచించారు. విద్యా రంగంలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత పెరగాలని
ఆకాంక్షించిన ఆయన, జ్ఞాన సముపార్జన నైపుణ్య శిక్షణలే పేదరికాన్ని పారద్రోలే
మంచి మార్గాలని తెలిపారు.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం… తదితర అంశాలు
అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు… యోగ, నడక,
వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా
కాపాడుకోవచ్చని ఉపరాష్ట్రపతి తెలిపారు. అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి
ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి
భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. మన పెద్దలు
కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు సూచించారని, వారు చూపిన బాటలో
ముందుకు సాగి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.