సమాచార శాఖకు ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయాలి
ఇళ్లు, ఇళ్ళ స్థలాలివ్వాలి
ప్రతి ఆర్నెళ్లకోమారు సీఎం సమీక్షించాలి
2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే
పరిష్కరించాలి
ఎండబ్ల్యూజేయు విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి స్వరాష్ట్ర సాధనలో
భాగస్వాములైన జర్నలిస్టులకు కులం, మతంతో సంబంధం లేకుండా ఆదుకోవాలని, రైతుబంధు,
దళిత బంధు తరహాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా జర్నలిస్టు బంధు ప్రకటించాలని
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాజన వర్కింగ్
జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ
మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార
శాఖకు ప్రత్యేక మంత్రి, పూర్తి స్థాయి కమీషనర్ లేకపోవడం విచారకరమన్నారు.
సమాచార శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండటం వల్ల జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తమ
సమస్యలను ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని
తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలోనూ సమాచార శాఖకు ప్రత్యేక
మంత్రి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో సమాచార శాఖను మరో
మంత్రికి అప్పగించాలని సీఎం కేసీఆర్ కు విన్నవించారు. ఈ అంశాన్ని డిమాండ్
గానో, హెచ్చరిక గానో కాకుండా న్యాయబద్దంగా భావించి సానుకూల దృక్పథంతో
ఆలోచించాలని కోరుతున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జర్నలిస్టు
సంఘాలతో ప్రతి 6 నెలలకు ఒకసారి జర్నలిస్టుల సమస్యలపై సమీక్షా సమావేశం
నిర్వహించాలని కోరారు. 2014 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో
ప్రకటించిన విధంగా జర్నలిస్టు సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు అన్నారు.
జర్నలిస్టులు అందరికి అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయం కూడా
అసంపూర్ణంగానే ఉందన్నారు. హెల్త్ కార్డులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలని కోరారు. 2014 టిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులందరికు ఇళ్ల
స్థలాలు, ఇండ్లు కట్టించి ఇవ్వడం, జర్నలిస్టు భవన్ నిర్మాణం తదితర హామీలు
రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం కూడా అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర
ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్
చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగంలో
ఉన్నట్టు ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ జర్నలిస్టుల
కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వెనకబడి ఉందన్నారు. తమిళనాడు, కేరళ,
కర్ణాటక తదితర రాష్ట్రాలలో రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం
ఉందన్నారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం
కల్పించాలని కోరారు. జర్నలిజంలో అత్యధికంగా పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారే
ఉన్నందున దళిత బంధు తరహాలో జర్నలిస్టు బంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలన్నారు.
ఇప్పటికే అమలవుతున్న దళిత బంధు పథకంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు రేగా
కాంతారావు, ముఠా గోపాల్ వారి వారి పరిధిలో దళిత జర్నలిస్టులకు దళిత బంధు
పథకాన్ని మంజూరు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో అందరూ ఎమ్మెల్యేలు దళిత జర్నలిస్టులకు
దళిత బంధు పథకం మంజూరయ్యేలాగా ఆదేశాలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యధికంగా తెలంగాణ ఇతర యాజమాన్యాలకు చెందిన పత్రికలు
ఉన్నాయని, ఈ సమయంలో తెలంగాణ ఉద్యమానికి చిన్న పత్రికలు అండగా ఉన్నాయని
విషయాన్ని విస్మరించరాదన్నారు. చిన్న పత్రికల సమస్యలను ఎలాంటి తారతమ్యాలు
లేకుండా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. చిన్న పత్రికల అప్
గ్రేడ్ ప్రక్రియ నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉందని,ప్రభుత్వం దృష్టి సారించి
త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఎప్పుడు అండగా
ఉంటుందన్నారు. నూతనంగా ఏర్పాటైన మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ
మహాసభలు ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ లోగా
అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండల కేంద్రాల్లో నిర్మాణం కమిటీల ఏర్పాటు
పూర్తి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మహాజన వర్కింగ్ జర్నలిస్ట్
యూనియన్ జాతీయ కన్వీనర్ దాస్ మాతంగి, కో కన్వీనర్లు సుంచు అశోక్, చాటింపు
అశోక్, సాయి రమేష్, గజ్జల వీరేశ్ నాయకులు మనోహర్, జహంగీర్ తదితరులు
పాల్గొన్నారు.