విజయవాడ : సమాజాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ
పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నేతలు
కోరారు. రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిని కలిసి ఈ మేరకు
వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అర్హులైన
జర్నలిస్టులందరికీ 2023-2024 సంవత్సరానికి సంబంధించి అక్రిడిటేషన్ల మంజూరు
ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. అలాగే జర్నలిస్టులందరికీ రూ.10లక్షల
ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టుల వెల్ఫేర్
కమిటీని, జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీని, తక్షణమే పునరుద్ధరించాన్నారు.
తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న అకాల మరణం పొందిన
జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు అందిస్తున్న పెన్షన్ స్కీమ్‌ను రాష్ట్రంలోనూ
అమలు చేయాలని కోరారు. 20 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన వారికి రూ.10వేల
చొప్పున పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలన్నారు. జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్
నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించాలని, రాష్ట్రంలో
పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ ఉచితంగా
ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణ పథకం కింద పక్కా గృహాలు నిర్మించి
ఇవ్వాలని వారు కోరారు. అంతేకాక జర్నలిస్టుల హెల్త్‌కార్డుకు సంబంధించి
జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఆయన అధికారులను
పిలిపి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాక మిగతా సమస్యలను
పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంపీఏ
రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు మన్నె సోమేశ్వరరావు,
ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లిఖార్జునరావు, జాయింట్ సెక్రటరీ పసుపులేటి
చైతన్య, విజయవా నగరాధ్యక్షుడు అనిల్‌కుమార్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.