వెలగపూడి : రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు
కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్
కె.ఎస్.జవహర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజ్ఞప్తి చేసారు.
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డిని ఏపీజేఎఫ్ రాష్ట్ర
కార్యదర్శి శాసపు జోగినాయుడు బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా
కలుసుకున్నారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ముందుగా సీఎస్‌కు ఏపీజేఎఫ్
తరఫున జోగినాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
జర్నలిస్టుల సమస్యలను సీఎస్‌కు వివరించారు. రాష్ట్రంలోని అర్హులైన
జర్నలిస్టులందరికీ అక్రిడిడేషన్ కార్డులతో పాటు బస్సు ,రైల్వే ల్లో
ప్రయాణించే సమయంలో రాయితీ కల్పించాలని, అర్హులైన జర్నలిస్టులకు సొసైటీలతో
సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. డివిజన్ కేంద్రాల్లో
డివిజన్ పౌరసంబంధాల శాఖ అధికారులను నియమించడంతో పాటు అధికారిక కార్యక్రమాలను
ఎప్పటికప్పుడు మీడియాకు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని
విన్నవించారు. జిల్లాల పునర్వభజన తర్వాత కొన్ని డివిజన్ పీఆర్ఓల
కార్యాలయాలను ఎత్తివేసి, ఆ సిబ్బందిని జిల్లా కేంద్రానికి తరలించారు. డివిజన్
పీఆర్ఓ కార్యాలయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల
తరహాలో 50 సంవత్సరాలు దాటిన సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.3000 పింఛను
ఇప్పించాలని, ప్రెస్ అకాడమి తరఫున ఏటా ప్రతి డివిజన్ కేంద్రంలో శిక్షణ
తరగతులు నిర్వహించాలని, వాటిని కనీసం వారం రోజులకు తగ్గకుండా శిక్షణ ఇవ్వాలని,
ప్రెస్ అకాడమీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని,అకాడమీ లో సభ్యులను
నియమించాలని జోగి నాయుడు విజ్ఞప్తి చేశారు.