ఆ పత్రిక తప్పుడు కథనాలపై దేవులపల్లి అమర్ ఫైర్
అనంతపురం : ఓ దినపత్రిక తప్పుడు కథనాలపై ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు
దేవులపల్లి అమర్ మండిపడ్డారు. అనంతపురంలో జరిగిన సీనియర్ జర్నలిస్టు
వై.తిమ్మారెడ్డి వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జర్నలిజం నాడు-నేడు
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత ఫొటోలను ప్రచురించి ప్రభుత్వాన్ని
అభాసుపాలు చేయాలని రామోజీ రావు కుట్ర పన్నినట్లు తెలిపారు. 151 స్థానాలతో
ఏర్పడిన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఓ వర్గం మీడియా ప్రతి రోజూ
ప్రయత్నిస్తోందని అమర్ మండిపడ్డారు. పట్టాభి విషయంలో పాత ఫోటోలను ప్రచురించి ఆ
తర్వాత చింతిస్తున్నామంటూ సవరణ రాసిన ఈనాడు వైఖరి సరికాదన్నారు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని, ఏ ఒక్క రోజూ ఎల్లో
మీడియా మంచిని చూడలేదని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, దేశరాజకీయాలు తన
చెప్పు చేతల్లో ఉండాలని రామోజీ కోరుకుంటారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు “నాడు-
నేడు” ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని
విడదీసి చర్చించు కోవలసిన తరుణం ఆసన్నమైందని దేవులపల్లి అమర్ అన్నారు. సీనియర్
జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురం లలిత
కళా పరిషత్ లో నిర్వహించిన సభలో “జర్నలిజం నాడు – నేడు” అంశం పై రాష్ట్ర జాతీయ
మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఆంధ్రప్రభ
దినపత్రిక లో సబ్ ఎడిటర్ గా పనిచేసిన తిమ్మారెడ్డి నాకు మంచి మిత్రుడు అని,
పత్రికా రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖ పాత్రికేయుులతో వారు కలిసి
పనిచేశారని వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని, జర్నలిస్టుల సంక్షేమం
కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని, వారి జీవిత
చరిత్ర ను పుస్తక రూపంలో తీసుకువస్తే, జర్నలిజంలో ఆణిముత్యాలు వెలుగులోకి
తీసుకు వచ్చినట్లు అవుతుందని, అమర్ సూచించారు.
ప్రభుత్వం వేసిన ఒక కమిటీలో జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని,
ముఖ్యమంత్రి ఆమోదం తరువాత ప్రతిపాదనలు అమలవుతాయని అమర్ తెలిపారు. అనంతపురం
జిల్లా కు చెందిన సీనియర్ పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ
కార్యక్రమంలో ఉరవకొండ మాజీ శాసన సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, తదితరులు
పాల్గొన్నారు.