విజయవాడ : సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 25 వ డివిజన్ 96 వ
వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక
కార్పొరేటర్ బంకా శకుంతలదేవి భాస్కర్, అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
అన్నదాన సమాజం రోడ్డు, కరెంట్ ఆఫీస్ రోడ్డు, సంజీవయ్య కాలనీ, కాల్వగట్టు
వీధులలో విస్తృతంగా పర్యటించి 323 ఇళ్లను సందర్శించారు. మూడున్నరేళ్లుగా
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఒరవడిని
స్థానికులకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్
లెట్లను లబ్ధిదారులకు అందించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దూరం
కాకూడదనే లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు
మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ
ముందుకెళుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక దోబీఘాట్ ను
సందర్శించారు. ఘాట్లో మైనర్ మరమ్మతులు నిర్వహించి ఫెన్సింగ్ ఏర్పాటు
చేయవలసిందిగా ఇంజనీరింగ్ విభాగానికి తెలిపారు. కమ్యూనిటీ టాయిలెట్లను
పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వీఎంసీ సిబ్బందికి సూచించారు. అలాగే రేవు వెంబడి
పేరుకున్న గుర్రపుడెక్కను తొలగించాలని ఆదేశించారు.
ప్రతి శుక్రవారం డ్రై డే తప్పనిసరి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని.. తమ ఇంటి పరిసరాలను
ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మల్లాది విష్ణు అన్నారు. పర్యటనలో
భాగంగా పరిసరాల పరిశుభ్రతపైన, దోమల నివారణ మార్గాలపై స్థానికులకు విస్తృత
అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎక్కువ రోజులు ఇళ్లల్లో నీటిని నిల్వ
ఉంచకూడదని ఈ సందర్భంగా సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే ప్రక్రియను
పకడ్బందీగా చేపట్టడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చని.. వ్యాధులు దరిచేరవని
తెలిపారు. డెంగ్యూ దోమలు మంచినీటిలో ఎక్కువగా గుడ్లు పెడతాయని.. కనుక
గృహాల్లోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ట్యాంకులు, కుండీలలో కనీసం మూడు
రోజులకోసారి నీటి నిల్వలను తొలగించాలన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు
పూర్తి స్థాయిలో జరిగేలా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు ప్రత్యేక శ్రద్ధ
తీసుకోవాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.