బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో పోరాడతాయని
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు. త్వరలోనే మరోసారి భేటీ అవుతామని
చెప్పారు. వచ్చే సమావేశంలో ఉమ్మడి అజెండాను రూపొందించుకుంటామని కాంగ్రెస్
అధినేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఎన్ని విభేదాలు ఉన్నా కలిసే పోరాడతామని
బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే, ఒంటరిగా పోరాడటం చేతగాకే ఇతర
పార్టీల మద్దతును కాంగ్రెస్ కోరుతోందని బీజేపీ విమర్శించింది.
సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడాలని విపక్ష పార్టీలన్నీ నిర్ణయించినట్లు
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 17 పార్టీలు కలిసే
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు. విపక్ష పార్టీల సమావేశం బాగా
జరిగిందని అన్న ఆయన వివిధ పార్టీల నేతలు సమావేశంలో తమ అభిప్రాయాలను
వెల్లడించినట్లు చెప్పారు.బీజేపీ సర్కారును గద్దెదించేందుకు విపక్షాలను ఏకం
చేయడమే లక్ష్యంగా పట్నాలో 15 పార్టీలు భేటీ అయ్యాయి. చర్చల అనంతరం ప్రెస్
కాన్ఫరెన్స్ నిర్వహించాయి. ఇందులో మాట్లాడిన నీతీశ్ త్వరలోనే మరోసారి విపక్షాల
భేటీ జరుగుతుందని తెలిపారు. తదుపరి విపక్ష సమావేశం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాలో నిర్వహించనున్నట్లు చెప్పారు. జాతీయ ప్రయోజనాలను
దృష్టిలో పెట్టుకొనే తామంతా కలిసినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలో
ఉన్నవారు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారని ధ్వజమెత్తారు.
‘త్వరలోనే ఉమ్మడి అజెండా’
2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఉమ్మడి అజెండాను వచ్చే సమావేశంలో నిర్ణయిస్తామని
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బీజేపీని
ఓడించాలంటే రాష్ట్రాలవారీగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.
మరోవైపు, విపక్ష పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయన్న రాహుల్ గాంధీ తమ
భావజాలాన్ని కాపాడుకుంటూనే వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరపాలని
నిర్ణయించినట్లు చెప్పారు.