బీజింగ్ : 2027 నాటికి ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తన సైన్యానికి సూచించారు. ఇందుకోసం ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని, పోరాటాలకు సిద్ధంగా ఉండడంతోపాటు యుద్ధాల్లో గెలిచేందుకు సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. చైనా జాతీయ భద్రతలో అనిశ్చితి పెరుగుతోందని అధ్యక్షుడు షి జిన్పింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సైన్యం భవిష్యత్తులో జరిగే పోరాటాలను గెలిచేందుకు సామర్థ్యాలను, యుద్ధ సన్నద్ధతను పెంచుకొనేందుకు పూర్తి శక్తియుక్తులను ధారపోయాలని సూచించారు. మూడోసారి మిలటరీ కమిషన్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు జిన్పింగ్ సీపీసీకి వ్యూహాత్మక మద్దతునిచ్చే సీఎంసీలోని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైన్యంలోని 20లక్షల మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
‘శతాబ్దంలో ఎన్నడూ చూడని మార్పులకు ప్రపంచం లోనవుతోంది. చైనా జాతీయ భద్రత అస్థిరత, అనిశ్చితిని ఎదుర్కొంటోంది. దాని సైనిక లక్ష్యాలు కూడా కఠినతరంగా మారాయి. ఈ నేపథ్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉండేందుకు అన్ని వనరులను వినియోగించుకోవడంతోపాటు యుద్ధాల్లో గెలిచే సామర్థ్యాలను పెంచుకోవాలి. తద్వారా తమ లక్ష్యాలను సమర్థంగా పూర్తిచేయాలి. ముఖ్యంగా 2027 నాటికి ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని పెట్టుకున్న లక్ష్యంపై సైనికాధికారులు దృష్టి పెట్టాలి’ అని షి జిన్పింగ్ చెప్పినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో సెంట్రల్ కమిటీకి ఎన్నిక ద్వారా షి జిన్పింగ్ అక్టోబర్ నెలలో మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో సీపీసీ జనరల్ సెక్రటరీతో పాటు సెంట్రల్ మిలటరీ కమిషన్ , పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ల బాధ్యతలనూ ఆయన చేపట్టారు. ఇలా పార్టీ అధినేతగా, అధ్యక్షుడిగా, సర్వసైన్యాధ్యక్షుడిగా మూడు అత్యంత శక్తివంతమైన విభాగాలకు షి జిన్పింగ్ మూడోసారి నాయకత్వం వహిస్తున్నారు. ఐదేళ్ల పాటు జిన్పింగ్ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.