న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలుచోట్ల జాతీయ రహదారులు ఆక్రమణలకు గురికావడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ రహదారులపై ఆక్రమణల్ని తొలగించాలంటూ ఈ మేరకు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. నేషనల్ హైవేల ఆక్రమణలతో ట్రాఫిక్ నిర్వహణ, కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటమే కాకుండా భవిష్యత్తులో చేపట్టే రహదారుల అప్గ్రేడేషన్ ప్రాజెక్టులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. జాతీయ రహదారుల నియంత్రణ (భూమి- ట్రాఫిక్) చట్టం- 2002 ప్రకారం ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు అధికారం ఉందని తెలిపింది.
కానీ ఇప్పటికే చాలా వరకు నేషనల్ హైవేకు చెందిన భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంది. జాతీయ రహదారులను దాబాలు, కూరగాయల విక్రయదారులు, తదితరులు ఆక్రమిస్తున్నట్టు మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. నేషనల్ హైవేలపై ఆక్రమణల్ని నివారించేందుకు, ఆ భూమిలో అన్ని రకాల ఆక్రమణల్ని తొలగించేందుకు క్షేత్రస్థాయి బృందాలు ఎప్పటికప్పుడు డ్రైవ్లు చేపడుతున్నాయని పేర్కొంది. నేషనల్ హైవేకి చెందిన భూమిని శాశ్వతంగానైనా లేదా తాత్కాలికంగా ఆక్రమించినా ట్రాఫిక్ నిర్వహణ, భవిష్యత్తులో అప్గ్రేడేషన్ ప్రాజెక్టులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని లేఖలో తెలిపింది.