మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా
నిమిషానికి 11 ఓడలు..భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం
లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు యోచనలో కేంద్రం
ప్రపంచంలో ఏ దేశానికైనా సముద్ర ఆధిపత్యం అపరిమిత శక్తిని ఇస్తుంది. భారత్‌కు మూడు వైపులా సముద్రం ఉండటం అంతర్జాతీయ వేదికపై భౌగోళికంగా, రాజకీయంగా రాణించేందుకు దోహదపడుతోంది. అండమాన్, లక్షద్వీప్‌లు భారత్‌కు వ్యూహాత్మక స్థావరాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రెండు దీవుల సమూహాలను భారత్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఎంతగానో కృషి చేశారు. 1947 ఆగస్టు 15న భారత్, పాకిస్థాన్‌లుగా రెండు దేశాలు అవతరించాయి. దేశీయంగా అనేక సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేదే లేదని భీష్మించాయి. పటేల్ రంగంలోకి దిగి, ఒక్కొక్క సంస్థానాన్ని విలీనం చేయడంలో తలమునకలుగా ఉన్నారు. అదే సమయంలో జిన్నా ‘లక్షద్వీప్’పై కన్నేశాడు. పాక్ తీరం నుంచి అది చాలా దూరంలో ఉంది. భారత్‌లోని మలబార్ తీరానికి సమీపంలో ఉంది. ఈ అంశం ఆధారంగా భారత్‌లోనే ఉండాలని పటేల్ తీర్మానించారు. జిన్నా కూడా వేగంగా పావులు కదపడం మొదలుపెట్టాడు. పాక్ నౌకాదళాన్ని అక్కడకు వెళ్లమని ఆదేశాలు ఇచ్చాడు. దీన్ని పసిగట్టిన పటేల్ మన నౌకాదళానికి చెందిన కొందరు సిబ్బందిని లక్షద్వీప్ వెళ్లమని ఆదేశించారు. వెంటనే మన వాళ్లు అక్కడకు చేరుకున్నారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కొద్దిరోజుల తరువాత అక్కడకు చేరుకున్న పాక్ నౌకాదళం భారత జాతీయ జెండాను చూసి వెనక్కు జారుకుంది.
మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా : అనంతరం లక్షద్వీప్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేశారు. 1956లో కొత్తగా ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్రంలో కలిపారు. అదే ఏడాది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1971లో లక్షద్వీప్‌గా పేరు మార్చారు. అంతకు ముందు లక్కదీవ్, మినికోయ్, అమిన్ దీవిగా వ్యవహరించేవారు.
నిమిషానికి 11 ఓడలు..భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం
లక్షద్వీప్ పర్యాటక అంశం తెలిసినప్పటి నుంచి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఆ దీవుల గురించి నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. ఈ దీవులకు సంబంధించిన మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. భారత్ అధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఎలాంటి అలజడి జరిగినా.. ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం లక్షద్వీప్‌లోని కాల్పెనీ, మినికోయ్ దీవులను వేరుచేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం. నిమిషానికి 11 ఓడలు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపాల నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్తుండటం భారత్‌కు సముద్రమార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కలిగించింది. మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న యోచన కేంద్రానికి ఉంది. భవిష్యత్తులో ఇది మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుంది. చైనాతో భారీ స్థాయిలో ఘర్షణలు ఏర్పడితే.. ఈ మార్గాన్ని మూసివేస్తే డ్రాగన్ ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది.
లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు యోచనలో కేంద్రం : లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న వేళ ఈ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన పర్యటనతో ఈ దీవుల పేరు ఇప్పుడు మార్మోగుతోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల చూపు వీటిపై పడింది. ఈ దీవుల కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అటు కేంద్రం కూడా లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్కడ కొత్తగా మరో ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిలిటరీ, వాణిజ్య అవసరాల కోసం మినికోయ్‌లో నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫైటర్ జెట్లు, సైనిక రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాటు వాణిజ్య విమానాల నిర్వహణ సామర్థ్యం ఉండేలా ద్వంద్వ ప్రయోజనాలతో కొత్తగా ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు చేస్తోంది. మినికోయ్ దీవుల్లో ఈ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
లక్షద్వీప్‌లో నిర్లవణీకరణకు సిద్ధం : వాస్తవానికి మినికోయ్ దీవుల్లో రక్షణరంగ అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, సముద్రపు దొంగల దాడులు పెరుగుతున్న వేళ వాటిపై నిఘాను పెంచేందుకు ఈ ప్రాంతం మెరుగ్గా ఉపయోగ పడుతుందని కోస్ట్‌గార్డ్ గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అయితే తాజాగా పౌర విమానాలు కూడా రాకపోకలు సాగించేలా ఇక్కడ కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని కేంద్రం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ దీవుల పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని యోచిస్తోంది. లక్షద్వీప్‌లో ప్రస్తుతం ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. 1987-88లో అగత్తి దీవుల్లో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత దశలవారీగా విస్తరించారు.