సీఎం రేవంత్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌తో ముందడుగు
కొత్త పెవిలియన్, డ్రెస్సింగ్ రూమ్స్, కార్యాలయం ప్రారంభం
హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుంచే శ్రీకారం చుట్టామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ కావడంతో, క్రీడలపై సీఎంకు ఉన్న ఆసక్తిని గమనించి మహబూబ్‌నగర్ నుంచి జిల్లాల క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోమవారం జగన్మోహన్ రావు సహచర హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే వై.శ్రీనివాస్ రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్‌లో హెచ్‌సీఏ నిధులతో నిర్మించిన స్టేడియంలో, సుమారు రూ.25 లక్షలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, పెవిలియన్, డ్రెస్సింగ్ రూమ్‌లను లాంఛనంగా ప్రారంభించి, అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ స్థాయిలో జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లోనూ స్టేడియాల నిర్మాణం, హెచ్‌సీఏ అకాడమీలను నెలకొల్పుతామన్నారు. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసి, వారికి రాష్ట్ర జట్లు తరఫున ఆడేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈనెల 25 నుంచి జరగనున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ పూర్తయిన తర్వాత జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై మరింత ఫోకస్ పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్రావుతో పాటు హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, కోశాధికారి శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్, మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.