విశాఖపట్నం: ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే జి-20 సదస్సు ద్వారా
విశాఖ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు మరొసారి లభిస్తోందని, మహా నగరానికి
ఇది తలమానికంగా నిలవనుందని వైద్యశాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి విడదల రజని
పేర్కొన్నారు. ప్రణాళికాయుతంగా వ్యవహరించి సమన్వయంతో ముందుకెళ్లి దేశం
గర్వించేలా జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ను మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
సంబంధిత కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఒన్ ఎర్త్, ఒన్
ఫ్యామిలీ, ఒన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖ కేంద్రంగా
మూడు రోజుల పాటు జరిగే జి-20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర
మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్, పోలీసు
కమిషనర్, ఇతర అధికారులతో కలిసి శనివారం సాయంత్రం ఆమె సమీక్షా సమావేశం
నిర్వహించారు. సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన పద్దతులపై,
తీసుకోవాల్సిన చర్యలపై ఆమె మార్గనిర్దేశం చేశారు. సుందరీకరణ పనుల కోసం రూ.157
కోట్ల నిధులను వెచ్చించినట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆ రోజు రాత్రి 7.30 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో వెల్కమ్ డిన్నర్ ఉంటుందని
తెలిపారు. 28వ తేదీన రాడిసన్ బ్లూ హోటల్లో బ్రేక్ ఫాస్టు తర్వాత ప్రధాన
సమావేశం హోటల్లోని కన్వెన్సన్ హాలులో జరుగుతుందన్నారు. అనంతరం 3.30 గంటల నుంచి
6.30 వరకు మూడు రకాల సమావేశాలు జరుగుతాయని వివరించారు. రాత్రి 7.30 నుంచి 9.30
వరకు అదే హోట్ల సమీపంలోని బీచ్‌లో గాలా డిన్నర్ ఉంటుందని, దీనికి రాష్ట్ర
ముఖ్యమంత్రి హాజరుకానున్నారని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రసంగం
ఉంటుందని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 29వ తేదీన
రాడిసన్ హోటల్ సమీపంలోని బీచ్‌లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై
నిపుణుల చేత అవగాహన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. అల్పాహారం
అనంతరం రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం జరుగుతుందని
వివరించారు.