విజయవాడ: జి20 సమావేశాల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కొత్తడిల్లీ
వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్
బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ విధానంలో
గవర్నర్ పాల్గొనగా, జి20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపధ్యంలో ఈ
సమావేశం ప్రాధన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ
సమావేశంలో వివిధ రాష్ట్రాల సిఎంలు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు
పాల్గొన్నారు. భారత్ వేదికగా వివిధ నగరాలలో జరగనున్న జి20 సదస్సులకు
సంబంధించిన సన్నాహకాలపై ఈ సమావేశం చర్చించింది. ప్రధానితో సమావేశం అనంతరం
గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలోని 56 నగరాలు, పట్టణాలలో వివిధ అంశాలకు
సంబంధించి 200లకు పైగా జి20 సదస్సులు జరగనున్నాయన్నారు. ఈ సదస్సులకు
ఆంధ్రప్రదేశ్ కూడా అతిధ్యం ఇవ్వనుందని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్
నెలల్లో విశాఖపట్నంలో మూడు సదస్సులు నిర్వహించే అవకాశం ఉందని వివరించారు.
ఇప్పటికే మనం సన్నాహక సమావేశాలను నిర్వహించుకుంటున్నామన్నారు. సదస్సులకు
సంబంధించి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు సముచిత ప్రాధన్యత ఇచ్చారని
పేర్కొన్నారు.