కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్ : ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, ఆహార, పర్యావరణ, సౌందర్య
సాధనాల ఉత్పత్తి, పరిశోధన సంస్థ యూరోఫిన్స్ రూ. వెయ్యి కోట్లతో
హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో అత్యాధునిక ప్రయోగశాలతో కూడిన ప్రాంగణాన్ని
ఏర్పాటు చేయనుంది. 15 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే కొత్త ప్రాంగణంలో 90 వేల చదరపు
అడుగుల్లో ప్రయోగశాలను నిర్మిస్తారు. ఇతర కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి 1500
మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ వెల్లడించింది. సంస్థ కార్యనిర్వాహక
ఉపాధ్యక్షురాలు, బయోఫార్మా విభాగం అధ్యక్షురాలైన నటాలియా షుమన్ శనివారం తమ
ప్రతినిధి బృందంతో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ
అయ్యారు. జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా
యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై రాష్ట్రంలో కొత్త
పెట్టుబడుల గురించి చర్చించారు. దీనికి అనుగుణంగా తాజాగా ప్రాంగణం ఏర్పాటు
నిర్ణయాన్ని ప్రకటించారు. తాము ఏర్పాటు చేయబోయే కేంద్రం ద్వారా భారత్‌లో కొత్త
ఔషధాల అన్వేషణతో పాటు ఇతర దేశాలకు చెందిన ఔషధ, బయోటెక్ సంస్థలకు ఉత్పాదక,
అభివృద్ధి, పరిశోధన సేవలందిస్తామని నటాలియా చెప్పారు. ‘ఆసియాలోనే అతి పెద్ద
కేంద్రాల్లో ఒకటిగా యూరోఫిన్స్ కొత్త ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం
ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ ఔషధ రంగానికి మరింత ఊతమిస్తుందని కేటీఆర్
పేర్కొన్నారు.