వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. రహదారులపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎప్పుడైనా వచ్చిందా? స్వాతంత్య్రానికి ముందైనా ఇలాంటి జీవో ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది. బ్రిటీష్ వాళ్లు ఈ చట్టం ఉపయోగిస్తే స్వాతంత్య్ర పోరాటం జరిగేదా? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావట్లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ ఇలాంటి జీవో రాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.