పాల్గొని సందడి చేసిన నగర వాసులు
విశాఖపట్నం : ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో జరిగే జీ 20 సమావేశాలకు విశాఖ
నగరం ఆతిథ్యమివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్కే బీచ్‌లో
జీ 20 సన్నాహక మారథాన్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్,
గుడివాడ అమర్నాథ్, విడదల రజనిలు ఈ మారథాన్‌ను ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి
5కే, 10కే మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్‌లో విశాఖ నగర వాసులు పాల్గొని
సందడి చేశారు. ఈ క్రమంలోనే బీచ్‌లో పారా సైలింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో
మంత్రి ఆదిమూలపు సురేష్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రారంభంలో భాగంగా మంత్రి
సురేష్ పారా సైలింగ్కు సిద్ధమయ్యారు. అయితే పారా సైలింగ్ వాహనం మొదలులోనే
కాస్త ఒరిగింది. వెంటనే పారాచ్యూట్ సాయంతో నియంత్రించారు. మంత్రులు
సమక్షంలోనే పారా సైలింగ్ వాహనం అదుపు తప్పడంతో నిర్వాహకులు పై స్థానికులు
అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లిఖార్జున వెంటనే అదుపు
చేయడం వల్ల ప్రమాదం తప్పింది.
మరో వైపు జీ 20 సన్నాహక సమావేశాలకు విశాఖ సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది.
దేశ, విదేశీ ప్రముఖులు వస్తున్నందున విశాఖ నగరాన్ని అందంగా
తీర్చిదిద్దుతున్నారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు
చేస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి అతిథులు బస చేసే హోటల్ వరకూ రోడ్లును
నూతనంగా మార్చారు. ఫుట్ పాత్‌లు, దారి పొడవున్న పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు.
ప్రతినిధులు విశాఖలో పలు ప్రాంతాల్లో పర్యటించే అవకాశమున్నందున అందమైన
వాతావరణం కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.