రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలు సిద్ధం
హైదరాబాద్ : రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జులై 1న
(శనివారం) రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది.
9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న ఈ పరీక్ష నిర్వహణకు భారీగా ఏర్పాట్లు
చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయగా మొత్తం 40
వేల గదుల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష పారదర్శకంగా,
సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన టీఎస్పీఎస్సీ ఈ విషయమై ఇప్పటికే
జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, డీజీపీ, జిల్లా ఎస్పీలతో
సమావేశాలు నిర్వహించింది.
రెండు పేపర్లు : పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం
12.30 వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి
సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ప్రతీ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు
పరీక్షకేంద్రం గేట్లు మూసివేస్తారు. ఓఎంఆర్ షీట్లో డబుల్ బబ్లింగ్
చేయకుండా అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ ఎస్ఎంఎస్ పంపించడంతో పాటు అభ్యర్థులు
చేస్తున్న బబ్లింగ్ లోపాలతో కూడిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో
పొందుపరిచింది. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అధికారిని
టీఎస్పీఎస్సీ నియమించింది. ఆ అధికారి పర్యవేక్షణలో అభ్యర్థి పరీక్ష
కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్టికెట్, అందులోని పేరు, ఇతర వివరాలు, ఫొటో
గుర్తింపు కార్డును పరిశీలించి అనుమతించనున్నారు. పోలీసులు అభ్యర్థుల్ని తనిఖీ
చేసిన అనంతరం పరీక్ష గదుల్లోకి అనుమతిస్తారు. తనిఖీ సమయంలో అభ్యర్థులు
బెల్టులు తీయాలని, అనంతరం పెట్టుకోవాలని కమిషన్ సూచించింది. అభ్యర్థులు
తీసుకువచ్చిన ఫొటో గుర్తింపు కార్డు, హాల్టికెట్లలోని సంతకాలు,
నామినల్రోల్లో పెట్టే సంతకంతో సరిపోలాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ
మేరకు ప్రత్యేక శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లు హాల్టికెట్, నామినల్ రోల్,
గుర్తింపు కార్డుల్లోని ఫొటోలను పరిశీలించి, అభ్యర్థి గుర్తింపును
ధ్రువీకరిస్తారు.
పరీక్షా కేంద్రాలైన విద్యాసంస్థలకు 1న సెలవు : టీఎస్పీఎస్సీ జులై 1వ తేదీన
(శనివారం) ‘గ్రూప్-4’ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ రోజు పరీక్ష కేంద్రాలున్న
పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ
కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పరీక్ష నిర్వహించే 2,878 కేంద్రాలకు
సంబంధించిన విద్యాసంస్థలకు మాత్రమే సెలవు ఉంటుంది. ఆ రోజు పాలిటెక్నిక్
కళాశాలల్లో సప్లిమెంటరీ పరీక్షలున్నందున వాటిని వాయిదా వేస్తున్నామని, ఆ రోజు
జరగాల్సిన పరీక్షను జులై 15వ తేదీన నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య,
శిక్షణ మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.