విజయవాడ : విజయవాడ తూర్పు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహనరంగా 76వ
జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి రాష్ట్ర
నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు. జూలై 4న వంగవీటి మోహనరంగా 76వ
జయంతి వేడుకలను పురస్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో
ఉదయం 10 గంటలకు రంగా జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు
ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే క్రమంలో
జనసమీకరణలో భాగంగా అవనిగడ్డ విచ్చేసిన ఆయన స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్,
రాజా రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు మాణిక్యాలరావు, సభ్యులు మండల శేషు
వ్యాసం చిట్టిబాబు లను కలిశారు. వారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారణజన్ముడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని
కొనియాడారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా అందరి హృదయాలలో చిరస్మరణీయునిగా
వంగవీటి మోహనరంగా నిలిచారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే
ధ్యేయంగా పనిచేసే తక్కువ సమయంలో బడుగు బలహీన వర్గాల హృదయాలలో చెరగని ముద్ర
వేసుకున్నారని స్పష్టం చేశారు. ఆయన లేని లోటు పేద, బడుగు, బలహీన వర్గాలకు
తీరనిదని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న వంగవీటి రంగా జయంతి కార్యక్రమాలను
ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రంగా
జయంతి రోజున ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండి సేవా కార్యక్రమాలు
నిర్వహించినటువంటి వారికి, వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వారిని ఘనంగా
సన్మానించనున్నట్లు ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. కులమతాలకు,
పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం
చేయవలసిందిగా ఆయన కోరారు. ఇందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని
నియోజకవర్గాలను పర్యటించి జన సమీకరణ చేస్తున్నట్లు శ్రీనివాస్ కుమార్
వెల్లడించారు. ఈసందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నేతలతో
కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు అల్లం పూర్ణ, యరజర్ల మురళి శంకర్,
సత్యన్నారాయణ, సలీం పర్వీస్, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు ఆకుల
దుర్గాప్రసాద్, తిరుమలశెట్టి వేణు, జీవన్ బాబు, బత్తుల వెంకటేశ్వరరావు, అనేక
మంది స్థానిక నాయకులు పాల్గొన్నారు.