అంకితభావంతో పనిచేస్తాం
నరసన్నపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట నియోజకవర్గానికి నలుగురు
జెసిఎస్ మండల కన్వీనర్లను నియమించింది. (జెసిఎస్ అంటే జగనన్న సచివాలయాలు,
కన్వీనర్లు, గృహ సారథులు అని అర్థం). కన్వీనర్లుగా ఎంపికైన వారిలో పార్టీ
సీనియర్ నాయకులు సురంగి నర్సింగరావు (నరసన్నపేట), నక్క తులసీదాస్ (సారవకోట),
ధర్మాన జగన్ (జలుమూరు), కణితి సత్తిబాబు (పోలాకి) ఉన్నారు. వీరు తమకు బాధ్యత
అప్పగించిన మండలాల్లోని సచివాలయాల గృహ సారథులతో కలసి క్షేత్రస్థాయిలో సమన్వయం
చేసుకుంటూ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తారు. తమకు ఇలా పార్టీ కీలక
ప్రాతినిధ్య పదవులు కల్పించడం ద్వారా సేవలందించే అవకాశమిచ్చిన వైఎస్ఆర్సీపీ
జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు ఈ సందర్భంగా
వారంతా కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, పార్టీ
అధిష్టానం సూచించిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి
ఆశీస్సులు పొందడమే లక్ష్యంగా పనిచేస్తామని వారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు
ఇప్పటికే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాయని, అదే తరహాలో పార్టీ
కార్యక్రమాలు, ఆశయాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా అంకితభావంతో పనిచేస్తామని
వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.